Alexei Navalny Story: అలెక్సీ నావల్నీ.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పతాక శీర్షిక అయింది. రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్(Vlodemir Putin)ను నిత్యం విమర్శించి.. ఆయన పాలనను ఎండగట్టే.. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ.. ఆకస్మికంగా ప్రాణాలు విడిచారు. అదికూడా.. జైల్లో కావడంతో ఈ మృతి(Death)పై అనేక సందేహాలు.. సమాధానాలు లేని ప్రశ్నలు.. ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించిన నేతగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అయితే.. శుక్రవారం ఆకస్మికంగా నావల్నీ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీనికి గల కారణాలు పైకి చెబుతున్నవాటి కంటే కూడా.. అంతర్గత కారణాలు వేరేగా ఉండి ఉంటాయనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్నాయి.
అధికారుల వివరణ ఇదీ..
గతంలో అలెక్సీ నావల్నీ(Alexei Navalny)పై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు(Court) ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష(Prison) విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 'నావల్నీ శుక్రవారం వాకింగ్ చేసిన తరువాత అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది సమయానికే స్పృహ కోల్పోయిన నావల్నీకి వెంటనే వైద్య సేవలు అందించినా ఫలితం లేకపోయింది. నావల్నీ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు' అని అధికారులు తెలిపారు.
సందేహాలు ఇవీ..
పుతిన్ ప్రత్యర్థి మరణంపై అనేక అనుమానాలు(Doubts) ముసురుకున్నాయి. త్వరలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు(President Elections) జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పుతిన్ కు దీటుగా నిలిచే నాయకుడిగా నావల్నీ పేరే వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరులు కూడా ప్రచారం ప్రారంభించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నావల్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. యుద్ధోన్మాదం సరికాదని చెబుతూ వచ్చారు. రష్యా ప్రజలు కూడా శాంతినే కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఖైదీగా జైలుశిక్ష అనుభవిస్తున్న నావల్నీ.. కొన్ని నెలల కిందట జైలు నుంచి అదృశ్యమయ్యారని ప్రచారం జరిగింది. కొన్ని రోజులకు ఆయన ఆచూకీ లభించిందని నావల్నీ తరఫు న్యాయవాదులు చెప్పారు. కానీ అప్పటి నుంచే నావల్నీ అనారోగ్యానికి గురయ్యారని వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నావల్నీ మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
అసలు ఎవరీయన?
రష్యాలోని బ్యూటిన్(Beutin)లో నావల్నీ 1976 జనవరి 4న జన్మించారు. న్యాయశాస్త్రం(Law) అభ్యసించిన ఆయన.. మొదటి నుంచీ ప్రభుత్వ అవినీతిపై గట్టిగా పోరాడారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల మధ్య సంబంధాలను ఎండగట్టారు. ప్రజాస్వామ్య విలువలు, మానవహక్కుల కోసం గళమెత్తుతూ గుర్తింపు పొందారు. 2013లో మాస్కో మేయర్ ఎన్నికల్లో పుతిన్ మద్దతున్న సిట్టింగ్ మేయర్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలవడంతో నావల్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పుతిన్ పాలనలో రాజకీయ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించేవారు. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు.
ఫస్ట్ నుంచి టార్గెట్..
ప్రభుత్వ(Government) విధానాలను విమర్శించిన వారిని టార్గెట్ చేయడం అనేది ప్రపంచ దేశాల్లో కామన్ అయిపోయింది. ఇలానే నావల్నీ కూడా అనేక సందర్భాల్లో ఇబ్బంది పడ్డారు. 2017లో ఓ దుండగుడు నావల్నీ ముఖంపై రసాయనాన్ని పోశాడు. ఫలితంగా ఒక కన్ను చూపును కోల్పోయారు. 2020 ఆగస్టు 20న సెర్బియా నుంచి మాస్కోకు విమానంలో వస్తుండగా నావల్నీపై ‘నొవిచోక్’ అనే విషప్రయోగం జరిగినట్లు అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. ఆ విష ప్రభావంతో ఆయన కోమాలో ఉన్నారు. నావల్నీపై పుతిన్ విషప్రయోగం జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతిపై పోరాటానికి సంబంధించి.. నావల్నీ స్థాపించిన ‘ఫౌండేషన్ ఫర్ ఫైటింగ్ కరప్షన్’ను మాస్కోలోని ఓ కోర్టు నిషేధిత సంస్థగా ప్రకటించింది.
జాతీయ, మానవతా వాది!
నావల్నీ.. జాతీయవాదిగా, అంతకుమించిన మానవతా వాదిగా గుర్తింపు పొందారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా దాడిని తప్పుబడుతూ జైలు నుంచే తన సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై నెల రోజులు కూడా కాకముందే నిధుల దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ అభియోగాలపై నావల్నీకి మరో తొమ్మిదేళ్ల కారాగార శిక్ష ఖరారైంది. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై ఆయనకు నిరుడు ఆగస్టులో 19 ఏళ్ల జైలుశిక్ష పడింది.
నావల్నీ డాక్యుమెంటరీకి ఆస్కార్!
రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని కెనడాకు చెందిన దర్శకుడు డేనియల్ రోహెర్ ‘నావల్నీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. గతేడాది ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా `ఆస్కార్` పురస్కారం లభించింది. నావల్నీకి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.