Sydney Terrorist Attack | సిడ్నీలోని బాండీ బీచ్ లో రెండు రోజుల కిందట ఇద్దరు దుండగులు కాల్పులు జరుపుతుండగా తన ప్రాణాలకు తెగించి ఆ దుర్ఘటనను అడ్డుకున్న అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తిని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ పరామర్శించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన అహ్మద్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాటి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముష్కరులతో వీరోచితంగా పోరాడిన అహ్మద్ ను మంగళవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి ప్రధాని అల్బనీస్ పరామర్శించి అండగా నిలిచారు. అహ్మద్ ను రియల్ హీరో అని ప్రశంసించారు.
రియల్ హీరో అహ్మద్ ను పరామర్శించిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘అహ్మద్, మీరు ఆస్ట్రేలియా హీరో. ఇతరులను కాపాడటం కోసం మీ ప్రాణాలకు పణంగా పెట్టేందుకు మీరు వెనుకాడలేదు బాండీ బీచ్ వద్ద ప్రమాదం జరుగుతున్న చోటికి పరుగెత్తుకుంటూ వెళ్లి, ఒక ఉగ్రవాదిని నిరాయుధుడిని చేశారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనే ఆస్ట్రేలియన్ల గొప్పదనం అందరికీ కనిపిస్తుంది. ఆదివారం రాత్రి అచ్చంగా మేము చూసింది అదే. ప్రతి ఆస్ట్రేలియన్ తరఫున, మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించారు. సిడ్నీలోని బాండీ బీచ్ తీరంలో ఆదివారం సాయంత్రం (డిసెంబర్ 14)న హనుక్కా వేడుక నిర్వహించిన సమయంలో ఇద్దరు దుండగులు (తండ్రీకొడుకులు) కాల్పులు ప్రారంభించారు. AP నివేదిక ప్రకారం, సిబ్బంది కాల్పులలో ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన తండ్రీ కొడుకులలో ఒకరు అక్కడికక్కడే మరణించారు.
ఎవరీ అహ్మద్.. సిరియా నుంచి దశాబ్దం కిందట ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు అహ్మద్. సిడ్నీలో ఓ పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బోండీ బీచ్‌లో తన బంధువుతో కలిసి కాఫీ షాప్ ఉన్న సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించగానే అహ్మద్ అక్కడికి పరుగున వెళ్లి ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుల్లెట్ తగిలి ఆయన భుజానికి గాయం కాగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రభుత్వంపై యూదు వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పాలస్తీనాను గుర్తించడం వంటి నిర్ణయాలు యూదు వ్యతిరేక భావాలను రెచ్చగొడతాయని, ప్రపంచవ్యాప్తంగా యూదు వ్యతిరేకతపై కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్ట్రేలియాలో భద్రతా సంస్థలు హై అలర్ట్ లో ఉన్నాయి. ఈ కేసును ఉగ్రవాద కోణంలో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.
యూదులను లక్ష్యంగా చేసుకున్న తండ్రీ కొడుకులు
ఆస్ట్రేలియా దర్యాప్తు సంస్థలు కేసు విచారణ చేపట్టాయి. బాండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడిన వారిని తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల తండ్రి సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మరణించగా, 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. యూదుల పండుగ హనుక్కా వేడుకను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది, ఇందులో 16 మంది మరణించగా, 42 మంది గాయపడ్డారు.