శ్రీలంకకు 1996 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ అర్జున రణతుంగ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెట్రోలియం మంత్రిగా చేసిన సమయంలో అవినీతి ఆరోపణలపై రణతుంగను అరెస్టు చేయవచ్చని సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రణతుంగతో పాటు ఆయన సోదరుడు చమురు కొనుగోలు ఒప్పందం ఇచ్చే ప్రక్రియను మార్చారని, ఎక్కువ ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
శ్రీలంకకు భారీ నష్టం..
అవినీతిపై నిఘా ఉంచే సంస్థ ప్రకారం, మొత్తం 27 సార్లు చమురు కొనుగోలు జరిగింది. ఈ ఒప్పందాలు, కొనుగోళ్ల కారణంగా దేశానికి దాదాపు 80 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 23.5 కోట్లకు సమానం. అవినీతి ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ప్రకారం 2017లో ఈ కొనుగోలు జరిగింది.
విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ కొలంబో మేజిస్ట్రేట్‌కు రణతుంగ విదేశాల్లో ఉన్నారని, తిరిగి వచ్చిన తర్వాత అరెస్టు చేస్తామని తెలిపింది. పెట్రోలియం మాజీ మంత్రి అర్జున రణతుంగ సోదరుడు ధమిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం ధమికను బెయిల్‌పై విడుదల చేశారు. ధమిక రణతుంగ ఆ కొనుగోలు సమయంలో ప్రభుత్వ అధికారాల పరిధిలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారని తెలిసిందే.
ధమిక రణతుంగ ట్రావెల్ నిషేధం..
మేజిస్ట్రేట్ ధమిక ప్రయాణాలపై నిషేధం విధించారు. ఆయనకు శ్రీలంక, యుఎస్‌ఏలలో సైతం పౌరసత్వం ఉంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ సోదరుడు ప్రసన్నను గత నెలలో బీమా మోసం కేసులో అరెస్టు అయ్యాడు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే జూన్ 2022లో ఒక వ్యాపారవేత్తను బెదిరించి బలవంతంగా వసూళ్లు చేసిన కేసులో ప్రసన్నను దోషిగా తేల్చారు. ప్రసన్న గతంలో శ్రీలంక పర్యాటక మంత్రిగా పనిచేశారు.
కాగా, 1996 ప్రపంచ కప్ ఫైనల్‌లో అర్జున రణతుంగ కెప్టెన్‌గా ఉన్న శ్రీలంక జట్టు పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. భారత్, పాకిస్తాన్ తరువాత ఈ ఘనత సాధించిన మూడో ఆసియా జట్టుగా నిలిచింది.