Earthquake In Afghanistan: కొత్త సంవత్సరంలో భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జపాన్‌లో భూకంపం వచ్చిన సంగతి మర్చిపోకముందే బుధవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో భూమి కంపించింది. కేవలం30 నిమిషాల్లో వ్యవధిలో తాలిబన్ దేశంలో భూమి రెండు సార్లు కంపిచింది. నేసషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వివరాల ప్రకారం మొదటి భూకంపం ఫైజాబాద్ (Faizabad )కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో అర్ధరాత్రి 12.28 గంటలకు సంభించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.
అలాగే అదే ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో రాత్రి 12.55 గంటలకు 4.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు. గత ఏడాది డిసెంబర్ 12న ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభించిన సంగతి తెలిసిందే.
నవంబర్‌లో
ఇటీవల వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ వణికిపోతోంది. నవంబర్ 21న ఆ దేశ రాజధాని కాబూల్ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 73 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అక్టోబర్‌లో
అక్టోబర్ 7న సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 4 వేలకుపైగా మరణించారు. 20 గ్రామాల్లో దాదాపు 2 వేల ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు.
కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి తిండి, ఆశ్రయం లభించలేదు. ప్రజలు ఆకాశం క్రింద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, అనేక దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేశాయి.
అక్టోబర్ 7 విషాదానికి సరిగ్గా వారం రోజుల తరువాత మరోసారి అక్కడ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది చోటు చేసుకొంది. హెరాత్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపంలో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు.
జూన్‌లో 300 మంది మృతి
జూన్ 22న సైతం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 6.1 గా భూకంప తీవ్రత నమోదైంది. 6.1 తీవ్రతతో భూకంపం రావడంతో సుమారు 300 మందికి పైగా మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఖోస్ట్‌కు 44కిమీ దూరంలో భూకంపం సంభవించడంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అనేకమంది శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.
జపాన్‌లో భూకంపం..
జపాన్‌లో రెండు రోజుల క్రితం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీగట, తొయామా, ఇషికావా ప్రాంత ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు. వాజిమా నగర తీరాన్ని మీటర్ కన్నా ఎక్కువ ఎత్తైన అలలు వచ్చి తాకే ప్రమాదముందని హెచ్చరించారు.