Afghanistan: అఫ్ఘానిస్థాన్ లో వరుస భూకంపాలు స్థానిక ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 30 నిమిషాల వ్యవధిలోనే 3 భారీ భూకంపాలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మొదటి భూకంపం 12.11pm సమయంలో సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు చేసింది. ఆ తర్వాత 12.19pm సమయానికి మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.6 గా నమోదైంది. 12.42pm సమయంలో 6.2 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప ప్రధాన కేంద్రాన్ని గుర్తించారు.
ఈ వరుస భూకంపాలతో జనం ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. భూకంపాలతో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. నష్టం మాత్రం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అప్ఘానిస్థాన్ తరచూ భూకంపాలకు గురవుతుంది. హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో, ఇది యురేషియన్ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంటుంది. గత సంవత్సరం జూన్ లో అఫ్ఘానిస్థాన్ లోని పక్తికా రాష్ట్రంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో ఏకంగా వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. 10 వేలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
భూకంపం అంటే?
భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు... బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.
ప్లేట్ టెక్టోనిక్స్
భూమి బయటి పొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే 15 ప్రధాన స్లాబ్‌లతో విభజించి ఉంటుంది. ఈ స్లాబ్‌లు లిథోస్పియర్‌ను ఏర్పరుస్తాయి, ఇది క్రస్ట్ (కాంటినెంటల్ మరియు ఓషియానిక్) మరియు మాంటిల్ యొక్క ఎగువ భాగాన్ని కలిగి ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి సాపేక్షంగా చాలా నెమ్మదిగా కదులుతాయి, సాధారణంగా సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కదులుతాయి. అయితే ఈ కదలికలు ఎక్కువగా ఉంటే ప్లేట్ సరిహద్దుల వద్ద డిఫర్మేషన్ కు కారణమవుతుంది. దీని ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. చాలా భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి.
మానవ తప్పిదాలు
భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడడం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.