Giant Wheel Of Death in UK:
యూకేలో ఘటన..
యూకేలో ఓ సర్కస్‌లో జియాంట్ వీల్‌పై (Giant Wheel Accident) నుంచి ఓ యువకుడు ప్రమాదావశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. అప్పటికప్పుడు సర్కస్‌ని రద్దు చేశారు నిర్వాహకులు. గ్రేట్ యర్మౌత్‌లో ( Great Yarmouth) ఈ ప్రమాదం సంభవించింది. 33 అడుగులు ఎత్తున్న జియాంట్ వీల్ నుంచి అదుపు తప్పి పడిపోయాడు 20 ఏళ్ల యువకుడు. దీన్ని Giant Wheel Of Death అని పిలుస్తారు. అంత ప్రమాదకరంగా ఉంటుందది. దీనిపై స్టంట్‌లు చేయడం అంటే సాహసమే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీల్‌పైకి చాలా ఒడుపుగా ఎక్కిన యువకుడు అక్కడి నుంచి కిందకు దిగే క్రమంలోనే కాలు జారింది. కింద పడిపోయే క్రమంలో మధ్యలోని రాడ్‌కి తల బలంగా తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఆ వెంటనే ఆంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎముకలు విరిగిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అయితే...ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడు స్పృహలోనే ఉండడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
"క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్పెషల్ సర్కస్ షో నిర్వహించాం. ఈ క్రమంలోనే స్టంట్ పర్‌ఫార్మర్ జియాంట్ వీల్‌పై నుంచి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. బలంగా నేలను ఢీకొట్టాడు. బలమైన గాయాలైనప్పటికీ స్పృహలోనే ఉన్నాడు. ఈ ఘటన తరవాత ప్రేక్షకులు ఒక్కసారిగా ప్యానిక్ అయ్యారు. అందుకే వెంటనే షో రద్దు చేశాం. బాధితుడికి అవసరమైన వైద్యసాయం వెంటనే అందించాం. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. స్టంట్‌లు చేసే సమయంలో చిన్న తప్పిదం వల్ల కింద పడిపోయాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం"
- షో నిర్వాహకులు