ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తైంది. ప్రజాస్వామ్యం నుంచి ఇస్లామిక్ వాదుల పాలనలోకి జారిపోయిన ఈ ఏడాది కాలంలో దేశం ఆర్థికంగా పతనమైంది. అంతర్జాతీయంగానూ ఒంటరిగా మిగిలింది. పరిపాలనాపరమైన ఎన్ని సవాళ్లు ఉన్నా పట్టని తాలిబన్లు... ఏడాది పాలనకు గుర్తుగా వీధుల్లో మోటారు వాహనాలపై తిరుగుతూ ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా రాయబార కార్యాలయం ఉన్నచోట కొందరు ‘డెత్‌ టు అమెరికా’అంటూ నినాదాలు చేశారు.


పేదరికంలోకి లక్షల మంది..


అఫ్గాన్‌ పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశం పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఆర్థిక పతనానికి తోడు విదేశీ సాయం కూడా మందగించింది. లక్షల మంది పేదరికంలోకి జారుకున్నారు. తాలిబన్‌ పాలకులను ఏ దేశమూ గట్టిగా విశ్వసించకపోవడంతో... అంతర్జాతీయంగా అఫ్గాన్‌ ఒంటరిగా మారింది.


చదువు కూడా నిత్య పోరాటమే...
అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి... బాలికలు, మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఇబ్బంది కలిగించబోమని తాలిబన్లు మొదట్లో హామీఇచ్చారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. యుక్తవయసు పిల్లలు ఇప్పుడు విద్యాసంస్థల్లో చదువుకోలేని పరిస్థితి నెలకొంది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే నడినెత్తి నుంచి అరికాళ్ల వరకూ బురఖా ధరించాల్సిందే. చాలామంది తమ ఇళ్లలోని ఆడపిల్లల చదువులు ఆగిపోకూడదని ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి విద్యను చెప్పిస్తున్నారు. బాలికల కోసం అక్కడక్కడ రహస్య, భూగర్భ పాఠశాలలు వెలిశాయి. 


గర్వించదగ్గ రోజంటూ...
అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాన్ని అర్ధంతరంగా ముగించిన అమెరికా, నాటో బలగాలు... ఏడాది కిందట కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తాలిబన్ల బెడద నుంచి తప్పించుకోవడానికి వేలమంది అఫ్గాన్లు విమానాశ్రయానికి చేరి తమను కూడా తీసుకువెళ్లిపోవాలంటూ శరణు కోరారు. ఈ క్రమంలో తొక్కిసలాటలు, విధ్వంసం చోటుచేసుకుని అనేకమంది అక్కడే ప్రాణాలు విడిచారు. పలువురు విమాన చక్రాలు పట్టుకుని గాలిలో రాలిపోయిన దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే... "ఆగస్టు 15 గర్వించదగ్గ రోజు" అంటూ తాలిబన్లు సోమవారం వేడుకలు జరిపారు. బడులకు సెలవులు ప్రకటించారు. ‘‘దేవుడి మీద ఆధారపడటం, ప్రజల మద్దతు దేశానికి స్వేచ్ఛను, విజయాన్ని అందించాయి. అమెరికా, దాని మిత్రపక్షాల ఆక్రమణకు వ్యతిరేకంగా ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ విజయం సాధించిన రోజు" అని తాలిబన్‌ అధికార వార్తాసంస్థ బఖ్తర్‌ న్యూస్‌ అధిపతి అబ్దుల్‌ వాహిద్‌ రేయాన్‌ వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలన, భద్రత పెంపు, గసగసాల సాగు నిషేధించడం... తాలిబన్‌ సర్కారు ఏడాది కాలంలో సాధించిన విజయాలుగా అఫ్గాన్‌ అధికారిక మీడియా పేర్కొంది.


అలాంటి పాలనకు గుర్తింపు ఉండదు...
మానవ హక్కులను తుంగలో తొక్కే పాలనను అంతర్జాతీయ సమాజం ఎప్పటికీ గుర్తించదని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌ పట్ల ప్రపంచ బాధ్యత ఇంకా మిగిలే ఉందన్నారు. ‘‘అఫ్గానిస్థాన్‌, ఆ దేశ ప్రజలు సుస్థిర శాంతి, సమృద్ధితో వికసించేందుకు ఐరోపా కూటమి కృషి కొనసాగిస్తూనే ఉంటుంది" అని అఫ్గాన్‌లో ఈయూ ప్రత్యేక రాయబారి థామస్‌ నిక్లాసన్‌ పేర్కొన్నారు. అయితే, ఇందుకు అఫ్గాన్‌ పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం, మానవ హక్కుల పట్ల గౌరవంతో కూడిన సమగ్ర రాజకీయ విధానం అవసరమని ఆయన నొక్కి చెప్పారు