UK Next PM:


లిజ్ ట్రస్‌కు 22% అధికంగా ఓట్లు..


బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషు సునక్ కన్నా లీడ్‌లోనే ఉన్నారు ప్రత్యర్థి అభ్యర్థి లిజ్ ట్రస్. ప్రధాని అయ్యే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కన్‌జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్‌లో లిజ్‌ ట్రస్‌కు 22% అధికంగా ఓట్లు దక్కినట్టు ఒపీనియమ్ రీసెర్చ్ వెల్లడించింది. 450 మంది సభ్యులు తాము ఎటువైపు ఉంటారన్నది ఇప్పటికే స్పష్టం చేశారు. చాలా మంది లిజ్ ట్రస్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సభ్యుల్లో 61% మంది లిజ్ ట్రస్‌వైపు ఉంటామని చెబుతుండగా..మిగతా 39% మంది రిషి సునక్‌కు మద్దుతునిస్తామని వెల్లడించారు. దాదాపు 2 లక్షల మంది సభ్యులున్న కన్‌జర్వేటివ్ పార్టీ...తదుపరి ప్రధాని ఎవరు అని నిర్ణయించనుంది. బోరిస్ జాన్సన్‌పై అవినీతి ఆరోపణలు రావటం, కరోనా సంక్షోభ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం లాంటి పరిణామాలు ఆయనను గద్దె దించాయి. వెంటనే ప్రధాని రేసు మొదలైంది. అయితే శాంపిల్ ఓటింగ్‌లో 450 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక తమ అభిప్రాయాన్నీ ఎటూ తేల్చని వారి సంఖ్య 570గా ఉంది. వీరిలో 29% మంది ఆల్‌రెడీ ఓటింగ్‌లో పాల్గొన్నామని చెబుతుండగా, 47% మంది వివరాలు చెప్పలేదు. 19% మంది తమ అభిప్రాయం మారిపోవచ్చు అన్నట్టుగా సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ విధానంలో జరిగే ఓటింగ్‌లో ఎవరిది పైచేయి అయితే వారే ప్రధానిగా ఎన్నికవుతారు. ఇందుకు సంబంధించిన పోల్‌ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 12 వరకూ జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి. 


కారణాలివేనా..? 


ఎక్కువ మంది సభ్యులు లిజ్ ట్రస్‌కే మొగ్గు చూపటానికి కొన్ని కారణాలున్నాయి. రిషి సునక్‌పై సదభిప్రాయం లేని వారంతా లిజ్‌ ట్రస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెపై విశ్వాసం ఉండటం ఓ కారణమైతే...మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఆమె ఎంతో వినయంగా వ్యవహరించటం మరో కారణం. సునక్ రాజీనామా చేయటంతోనే బోరిస్ జాన్సన్ పతనం మొదలైందన్న వాదన కూడా ఉంది. ఈ అంశమూ సునక్‌పై కొంత మేర వ్యతిరేకతకు దారి తీసింది. అయితే రిషి సునక్‌కు మద్దతుగా నిలిచే వాళ్లంతా ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయనో ఆర్థికవేత్త అని, మేధావి అని కితాబునిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టటం ఆయనకే సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. ఇప్పటికీ కొందరు సభ్యులు జాన్సన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. లిజ్ ట్రస్‌కి ప్రధాని పదవి ఇవ్వటానికి బదులు మళ్లీ బోరిస్ జాన్సన్‌కే ఆ అవకాశం ఇస్తే బాగుండు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే...రిషి సునక్‌తో పోల్చుకుంటే..జాన్సనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్న వారు 68% మంది ఉన్నారు. మరి ఇంత వ్యతిరేకతను తట్టుకుని రిషి సునక్‌ పోటీలో ఎలా నిలబడతారో చూడాలి. 


Also Read: Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా


Also Read: Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?