పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటికి 52 మంది చనిపోయారు. మరో 130 మంది గాయాలపాలయ్యారు. అయితే ఆత్మాహుతి దాడి కారణంగానే పేలుడు జరిగిందని అక్కడి అధికారులు ధృవీకరించినట్లు పాక్‌ మీడియా డాన్‌ కథనాల్లో వెల్లడించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని  మస్తుంగ్‌ జిల్లాలో అల్పాలా రోడ్‌లోని మదీనా మసీదు సమీపంలో మిలాదున్‌ నబీ ఉరేగింపు కోసం ప్రజలు ర్యాలీ నిర్వహిస్తుండగా భారీ పేలుడు సంభవించినట్లు పేర్కొంది. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో మృతిచెందారు. దాడిలో మృతిచెందిన వారిలో పోలీసు అధికారి కూడా ఉన్నారు.


పేలుడు సంభవించిన ప్రాంతంలో పరిస్థితి భయానకంగా మారింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో విషాదకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను సహాయక సిబ్బంది క్వెట్టాలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అన్ని ఆస్పత్రులలో అత్యవసర పరిస్థితిని విధించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది.  బలూచిస్థాన్‌లో మత సామరస్యం, శాంతిని నాశనం చేసేందుకు విదేశీ సహాయంతో దాడులు చేశారని పాక్‌ మంత్రి జాన్‌ అచక్‌జాయ్‌ వెల్లడించారు. ఈ దాడి భరించలేనిది అని అన్నారు.బ పేలుడు కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్‌ డోమ్కి వెల్లడించారు. 


మిలాదునబీ కారణంగా మసీదు వద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ర్యాలీ నిర్వహణ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ గాష్కోరి కూడా ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. డీఎస్పీ కారు వద్దే బాంబు పేలినట్లు తెలిపారు. సూసైడ్‌ బాంబర్‌ డీఎస్పీ కారు పక్కనే నిల్చుని తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


పేలుడు ఘటనపై పాకిస్థాన్‌ మంత్రి సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. పేలుడులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిలాదునబీ ఊరేగింపుపై ఇలాంటి దాడి హేయమైన చర్య అని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. తీవ్రవాదులను వదలిపెట్టబోమని, ఉగ్రవాదుల విషయంలో జీరో టాలరెన్స్‌ను అనుసరిస్తున్నామని ఆయన వెల్లడించారు.


గత నెలలో ఖైబర్‌ ఫంఖ్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పాక్‌ బలగాలకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. సుసైడ్‌ బాంబర్‌ మోటార్‌ బైక్‌పై వచ్చి భద్రతా దళాల కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో బాంబు పేలుడు సంభవించింది. అలాగే ఈ ఏడాది జులైలో కూడా పాక్‌లో ఓ ర్యాలీ సందర్భంగా ఇస్లామిక్‌ స్టేట్ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు అప్పుడు ఖైబర్‌ ఫంఖ్తున్వా ప్రావిన్స్‌ పోలీసులు తెలిపారు.