Viral Video: వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై పారే వరద నీటి తరహాలో రోడ్లపై వైన్ పారింది. లక్షల లీటర్ల వైన్ వీధుల వెంబడి ప్రవహించింది. ఎగుమతికి సిద్ధం చేసిన బ్యారన్లు పేలిపోవడంతో రోడ్లపై వైన్ వరద పారింది. దీంతో అధికారులు ఆ మందు వరదను పొలాలకు మళ్లించారు. మందుబాబులను ఆశ్చర్యానికి గురిచేసే ఘటన ఆదివారం పోర్చుగల్ దేశంలో జరిగింది. వివరాలు.. పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణం ఉంది. ఆదివారం ఆ పట్టణ వీధుల్లో రెడ్ వైన్ వరదలా ప్రవహించింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 






పట్టణంలోని లెవిరా డిస్టిలరీ డిస్టిలరీ 2 మిలియన్ లీటర్ల వైన్‌ను నుంచి ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసింది. పెద్ద బ్యారెన్లలో నిల్వ చేశారు. వాటిని రవాణా చేస్తుండగా బారెల్స్‌ అనుకోకుండా పేలిపోయాయి. దీంతో వైన్ కొండ ప్రాంతాల్లో వరదలా ఎగువ ప్రాంతం నుంచి కిందకు ప్రవహించింది. పట్టణంలోని నిటారుగా ఉన్న కొండపై నుంచి లక్షలాది లీటర్ల వైన్ వీధుల్లో ప్రవహించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇళ్లు, కాలువ, రోడ్లలో ప్రవహిస్తున్న వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ఊరి సందుల్లో వైన్‌తో నిండిన నది ప్రవహించినట్లు పోస్ట్ చేశారు. 


ఎంత వైన్ నేల పాలైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒలింపిక్ క్రీడల్లో స్విమ్మింగ్ పూల్‌ను నింపగలిగేంత వైన్ రోడ్డుపై ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వైన్ వరదలా ఇళ్లలోకి ప్రవహించింది. వైన్ పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రవహించే ముందు డిస్టిలరీకి సమీపంలో ఉన్న ఒక ఇంటిలోకి వైన్ వరద ముంచెత్తింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. పక్కనే సెర్టిమా నదిని వైన్ నదిగా మారకుండా, వైన్ వరదను ఆపడానికి అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. వరదను దారి మళ్లించి సమీపంలోని పొలాల్లోకి ప్రవహించేలా చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. భూములు ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఘటనపై లెవిరా డిస్టిలరీ క్షమాపణలు చెప్పింది. వైన్ ప్రభావంతో చెడిపోయిన భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. భూములు బాగు చేయించేందుకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది. ‘పాడైపోయిన భూములును బాగు చేసేందుకు, శుభ్రపరిచేందుకుచ మరమ్మతులు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తాం. వాటి ఖర్చులు భరించే బాధ్యత తీసుకుంటాము’ అంటూ డిస్టిలరీ ఒక ప్రకటనలో తెలిపింది.