World's Dirtiest Man: ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరు పొందిన ఇరాన్ వాసి అమౌ హజీ (94) మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. 60 ఏళ్లలో ఆయన ఒక్కసారి కూడా స్నానం చేయకపోవడంతో ఆయనకు ఈ పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.
అదే ఆరోగ్యం
అమౌ హజీ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్సులోని డెజ్‌గా గ్రామంలో ఒంటరిగా ఉండేవారు. ఆయన కుటుంబీకులు ఎవ్వరూ లేకపోవడంతో గ్రామస్థులే ఆయనకు చిన్న నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు స్నానమంటే అసహ్యం. కనీసం సబ్బుతో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కోవడం కూడా ఆయనకు ఇష్టముండదట.
రోడ్డుపైన చనిపోయిన మూగజీవాలను తినడంతోపాటు నాలుగైదు సిగరెట్లనూ ఒకేసారి పీల్చేవాడట. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారిన పడతాననే అపోహతోనే ఆయన అరవై ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉండిపోయారట. ఈ వృద్ధుడిపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది.
స్నానం చేశాక!
60 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నప్పటికీ హజీ ఆరోగ్యంగానే ఉన్నారు. అటువంటి వ్యక్తికి గ్రామస్థులందరూ కలిసి కొన్ని నెలల క్రితం బలవంతంగా స్నానం చేయించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే అక్టోబర్ 23న హజీ కన్నుమూశారు.
స్నానం చేసిన కొద్ది రోజులకే ఆయన మృతి చెందడం షాకింగ్‌గా ఉందని స్థానికులు తెలిపారు. ఇరాన్ మీడియా కూడా దీనిపై పలు కథనాలు ఇచ్చింది.
Also Read: G20 Summit: రిషి సునక్‌తో ప్రధాని మోదీ భేటీ- ఆ ఒప్పందం గట్టెక్కేనా?