e-KYC transactions: దేశవ్యాప్తంగా ఆధార్‌ అనుసంధానిత ఈ-కేవైసీ లావాదేవీలు జనంలోకి చొచ్చుకుపోతున్నాయి. లాస్ట్‌-మైల్‌ ప్రజలు కూడా ఆర్థిక అవసరాలకు ఈ-కేవైసీని ఒక సాధనంగా వాడడం మొదలు పెట్టారు. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే ఆధార్ ద్వారా 25.25 కోట్ల ఈ-కేవైసీ లావాదేవీలు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇవి దాదాపు 7.7% పెరిగాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సేవల్లో ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటు ప్రజల పనిని, అటు వ్యాపారాన్నీ సరళంగా మారుస్తోంది.


దాదాపు 1300 కోట్ల లావాదేవీలు
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి, మొత్తం 1297.93 కోట్ల ఆధార్ అనుసంధానిత ఈ-కేవైసీ ట్రాన్జాక్షన్లు జరిగినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ & ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి; ఏఈపీఎస్‌, మైక్రో ఏటీఎంల నెట్‌వర్క్‌ ద్వారా 1549.84 కోట్ల లాస్‌-మైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయి. ఒక్క సెప్టెంబర్‌లోనే దేశవ్యాప్తంగా 21.03 కోట్ల ఏఈపీఎస్‌ ట్రాన్జాక్షన్లు జరిగాయి.


సెప్టెంబర్‌లో, ఆధార్ ద్వారా 175.41 కోట్ల అథెంటికేషన్‌ ట్రాన్జాక్షన్లు జరిగాయి. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం వేలిముద్రల అథెంటికేషన్‌ను ఉపయోగించి జరిగాయి. దీని తర్వాతి స్థానంలో డెమోగ్రాఫిక్, ఆ తర్వాత ఓటీపీ అథెంటికేషన్‌ లావాదేవీలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం 8250.36 కోట్ల అథెంటికేషన్‌ లావాదేవీలు పూర్తయ్యాయి. ఆధార్ ఉద్దేశ్యం ఎంత వేగంగా నెరవేరుతోందో ఈ సంఖ్య సూచిస్తోంది.


93.92 శాతం జనాభాకు ఆధార్‌ కార్డ్‌లు
మన దేశంలో పెద్దవాళ్లకు ఆధార్‌ కార్డుల జారీ దాదాపుగా సంపూర్ణ స్థాయికి చేరింది. సెప్టెంబర్ చివరి నాటికి, ఆధార్ తీసుకున్న అన్ని వయసుల వారు దేశ మొత్తం జనాభాలో 93.92 శాతంగా ఉన్నారు.


1.62 కోట్ల ఆధార్‌ అప్‌డేషన్లు 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ఆధార్‌ కార్డుతో అనుసంధానమయ్యాయి. పారదర్శకత, సమర్థవంతంగా అమలు చేయడం కోసం.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కూడా ఆధార్‌కు అనుసంధానించాలని కేంద్రం గతంలోనే సూచించింది. దీంతో, ఇప్పటివరకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 1000 పథకాలను ఆధార్‌తో అనుసంధానించారు. వీటి నుంచి లబ్ధి పొందేందుకు ఆధార్‌ కార్డ్‌లో అడ్డంకిగా మారిన కొన్ని వివరాలను మార్చుకునేందుకు ప్రజలు ఆధార్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఆధార్‌ కార్డుల్లో వివరాల్లో మార్పుచేర్పుల కోసం ఆధార్‌ కార్డ్‌హోల్డర్ల నుంచి భారీగా వినతులు ఆధార్‌ అధీకృత సంస్థ ఉడాయ్‌కి (UIDAI) అందుతున్నాయి. 


పేరులో అక్షర దోషాల మార్పు, ఫొటోల మార్పు, చిరునామాలో మార్పులు, వేలిముద్రల మార్పు వంటి అప్‌డేషన్ల కోసం వచ్చే విజ్ఞప్తులు నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. కార్డుదారుల నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ల మేరకు, సెప్టెంబర్ నెలలో 1.62 కోట్లకు పైగా ఆధార్‌ కార్డ్‌ వివరాలను విజయవంతంగా అప్‌డేట్‌ చేశారు. ఆగస్టులో 1.46 కోట్ల ఆధార్‌ కార్డ్‌ వివరాల అప్‌డేషన్లు జరిగాయి. మొత్తంగా చూస్తే, సెప్టెంబర్ చివరి నాటికి 66.63 కోట్ల ఆధార్ కార్డ్‌ వివరాలను అప్‌డేషన్లు పూర్తయ్యాయి. ఫిజికల్‌ ఆధార్ సెంటర్లకు వెళ్లడం ద్వారా, లేదా ఆన్‌లైన్ ఆధార్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజలు అప్‌డేషన్ల కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు.