TS BJP :  తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎలా ఉంటాయో... తిరిగి వెళ్లిపోయే వాళ్లు కూడా అంతే వేగంగా  ఉంటాయి. గత కొంత కాలంగా బీజేపీలోకి చేరే వారు చేరుతున్నారు. వెళ్లిపోయేవాళ్లు వెళ్లిపోతున్నారు. వారి వల్ల బీజేపీకి లాభం కానీ నష్టం కానీ ఉండటం లలేదు. కానీ చేరిన వాళ్లు మాత్రం రాజకీయంగా భవిష్యత్‌ను కోల్పోతున్నారు. అలాంటి వారిలో నాగం జనార్ధన్ రెడ్డి దగ్గర నుంచి బండ్రు శోభారాణి వరకూ చాలా మంది ఉన్నారు. వీరిలో చాలా మంది రాజకీయంగా యాక్టివ్‌గా లేకుండా పోయారు. దీనికి కారణం ఏమిటి? బీజేపీలో నేతలు ఎందుకు ఇమడలేకపోతున్నారు ? సిద్ధాంతపరమైన వైరుధ్యాలా? బీజేపీలో అంతర్గత రాజకీయాలా ? హైకమాండ్‌ ప్రసన్నం చేసుకునే విద్యలో నైపుణ్యం లేకపోవడం వల్లనా ?


బీజేపీలో బయట నుంచి వచ్చిన నేతలు ఇమడలేరా ?


రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీది ఓ ప్రత్యేక శైలి. ఆ పార్టీ నిర్మాణం ఆరెస్సెస్ నుంచి  ప్రారంభమవుతుంది. వారిదో ప్రత్యేకమైన భావజాలం. అలా పార్టీలో ఎదిగిన వారు ఇతర పార్టీల్లో చేరలేరు. ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా బీజేపీలో ఉంటారు. అలాగే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేవారు కూడా  దాదాపుగా ఉండరు. అయితే ఈ చేరికలు ఉండవు అనే అభిప్రాయం.. భారతీయ జనతా పార్టీ మోదీ, అమిత్ షా చేతుల్లోకి వెళ్లిన తర్వాత మారిపోయింది. భావజాలాలతో సంబంధం లేకుండా అందర్నీ చేర్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ముఖ్యమంత్రి పదవులు కూడా అప్పగించారు. అస్సాం మాజీ సీఎం షర్బానంద సోనోవాల్.. ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్ నేతలే. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు ఇప్పుడు బీజేపీలో పలు రకాల పదవులు పొందుతున్నారు. ఆ క్రమంలో తెలంగాణ బీజేపీలో కూడా చేరికలు వచ్చాయి. కానీ ఇక్కడ నేతలు ఇమడలేకపోతున్నారు. 


నాగంతో ప్రారంభించి ఎన్నో చేరికలు.. కానీ ఒక్కరూ నిలబడలేకపోయారు !


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీలో చేరికలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయి మంచి  గుర్తింపు తెచ్చుకున్న నేత అయిన నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన  బీజేపీలో ఇమడలేకపోయారు. ఆ స్థాయి నేత  చేరితో దక్కాల్సిన ప్రాధాన్యం దక్కలేదు. ఆయన మాత్రమే కాదు.. ఆయనతో ప్రారంభించి అనేక మంది.. బీజేపీలో చేరారు..బయటకు వచ్చేశారు. ఎర్ర శేఖర్, మోత్కుపల్లి నర్సింహులు , పెద్ది రెడ్డి , బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ ,  బోడ జనార్దన్ , రాపోలు ఆనంద భాస్కర్, బంద్రు శోభారాణి, పుష్ప లీల ఇలా ఎంతో మంది బీజేపీలో చేరి.. మళ్లీ బయటకు వచ్చేశారు. కొంత మంది కనుమరుగయ్యారు. 


వలస నేతల్ని.. పార్టీలో పాతుకుపోయిన వాళ్లు ఎదనీయడం లేదా ?


తెలంగాణ బీజేపీలో పాతుకపోయిన సీనియర్లు కొంత మంది ఉన్నారు. తెలంగాణ బీజేపీ అంటే వారు.. వారంటే తెలంగాణ బీజేపీ. వాళ్లని కాదని ఎవరూ ఎదిగే అవకాశం ఉండదు. అలాంటి పెద్దల్లో కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్ లాంటి  వాళ్లు ఉంటారు. వారందరి కన్నా నాగం జనార్దన్ రెడ్డి మాస్ లీడర్ అయినా బీజేపీలో నిలబడలేకపోయారు. ఆయనకు ప్రాధాన్యం దక్కక చివరికి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఆయనకే ప్రాధాన్యం దక్కకపోతే.. పార్టీలో చేరే ఇతరులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఎక్కువగా మంది పార్టీలో నిలబడలేకపోతున్నారు. సిద్ధాంతాల వైరుధ్యం కూడా దీనికి కారణం అవుతుంది. గతంలో తాము పని చేసిన పార్టీలో ఉండే వాతావరణం.. బీజేపీలో ఉండే వాతావరణం భిన్నం. ఇది కూడా పార్టీలో ఇమడలేకపోవడానికి మరో కారణం. 


ఇటీవల పెరిగిన చేరికలు ..ఎంత ఉంది ఉంటారు ?


తెలంగాణ బీజేపీలో ఇటీవల చేరికలు పెరిగిపోయాయి. కరుడుగట్టిన టీఆర్ఎస్ వాది అయిన ఈటల రాజేందర్..తప్పని పరిస్థితుల్లో అస్తిత్వం కాపాడుకోవడానికి బీజేపీలో చేరక తప్పలేదు. కానీ అక్కడ ఆయన ఇమడగలుగుతున్నారా అంటే..  గట్టిగా ఔను అని చెప్పలేని పరిస్థితి. జితేంద్ర రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్లకు ఢిల్లీ నేతల దగ్గర పలుకుబడి ఉంటుంది కానీ ..తెలంగాణలో వారి మాట చెల్లుబాటు కాదు. కొత్త గా చేరిన రాజగోపాల్ రెడ్డి రాజకీయం గురించి బీజేపీ వాల్లకే బాగా తెలుసు. ఎలా చూసినా ఇలా కొత్తగా చేరుతున్న వారు ఎంత మంది ఉంటారో బీజేపీ నేతలే ఖచ్చితంగా చెప్పలేని పార్టీ. 


కారణం ఏదైనా కావొచ్చు.. సిద్ధాంతపరమైన వైరుధ్యం లేదా.. పాత నేతల రాజకీయం... ఏదైనా కానీ.., తెలంగాణ  బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కుదురుకోవడం అంత ..తేలిక కాదు. !