Women's Reservation Bill:


రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎక్కడ?


అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు అని స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తున్నాం. కానీ రాజకీయాల్లో మాత్రం ఇంకా వాళ్ల ప్రాధాన్యత పెద్దగా కనిపించడం లేదు. పదవి అలంకార ప్రాయమవుతోంది తప్ప అధికారం ఇవ్వడం లేదు. గ్రామ స్థాయిలో చూసుకున్నా సర్పంచ్‌లుగా మహిళలు ఎన్నికవుతున్నా...వాళ్ల చేతుల్లో పవర్ ఉండటం లేదు. వెనక నుంచి పురుషులే నడిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్న సమస్యే అయినా...ఏటా మహిళా దినోత్సవం రోజు మాత్రమే ఈ చర్చ వినబడుతుంది. ఆ తరవాత ఎవరికి వారే యమునా తీరే. కొందరు మహిళలు సవాళ్లన్నీ దాటుకుని రాజకీయాల్లోనూ రాణిస్తున్నప్పటికీ...పార్లమెంట్‌లో మాత్రం వాళ్ల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. 33% రిజర్వేషన్ బిల్‌ (Women's Reservation Bill) గురించి ఎన్నో దశాబ్దాలుగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్‌ను ఏ ప్రభుత్వమూ తీర్చలేకపోతోంది. రెండేళ్ల క్రితం మరోసారి ఈ బిల్‌ను ప్రవేశపెట్టినా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లో 33% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలోనూ ఇదే నియమం పాటించాలి. కానీ ఈ బిల్‌..చట్ట రూపం దాల్చడం లేదు. ఈ బిల్‌ను తొలిసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదో కలగానే మిగిలిపోయింది. 


తొలిసారి పార్లమెంట్‌లో..


Women's Reservation Bill చరిత్ర చాలా పెద్దదే. 1996లో సెప్టెంబర్ 12వ తేదీన తొలిసారి పార్లమెంట్‌లో ఈ బిల్‌ ప్రవేశపెట్టారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ సహా అన్ని అసెంబ్లీల్లోనూ 33% సీట్లు మహిళలకే కేటాయించాలన్నది ఈ బిల్ ప్రధాన ఉద్దేశం. ఆ తరవాత వాజ్‌పేయీ ప్రభుత్వం ఈ బిల్‌ను పాస్‌ చేసేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. యూపీఏ-1 ప్రభుత్వం 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్‌ను ప్రవేశపెట్టింది. ఆ తరవాత ఎన్నో చర్చలు జరిగాయి. చివరకు 2010 మార్చి 10వ తేదీన రాజ్యసభల్‌ పాస్ అయింది. కానీ లోక్‌సభలో మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. అప్పట్లో లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని RJD ఈ రిజర్వేషన్‌ బిల్‌ను వ్యతిరేకించింది.  2019 సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ పాస్ అవ్వలేదు. అప్పటి నుంచి ఇలా ఎన్నో చిక్కు ముడులు ఈ బిల్ చుట్టూ అల్లుకున్నాయి. 


రాజ్యాంగ సవరణతో..


1993లో రాజ్యాంగ సవరణతో మహిళా రిజర్వేషన్ బిల్ ఆలోచన తెరపైకి వచ్చింది. గ్రామ పంచాయతీల్లో మూడింట ఓ వంతు సర్పంచ్ సీట్‌లు మహిళలకే కేటాయించాలని నిర్ణయించారు. ఆ తరవాత 1996లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాక చర్చ మొదలైంది. అధికార ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపేంత వరకూ ఈ బిల్ చట్ట రూపం దాల్చే అవకాశముండదు. ఎందుకంటే...అధికార పార్టీకే పార్లమెంట్‌లో సంఖ్యాబలం ఎక్కువగా ఉంటుంది కనుక. తృణమూల్ కాంగ్రెస్ (TMC) 2019 ఎన్నికల్లో 40% మేర మహిళలకే సీట్లు కేటాయించింది. అయితే...ఇలా కొన్ని పార్టీలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి తప్ప అన్ని చోట్లా ఇది అమలు కావడం లేదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 8%గానే ఉన్నట్టు ఆ మధ్య ఓ సర్వే వెల్లడించింది. 


Also Read: Stock Market News: మేడమ్‌ సార్‌, మేడమ్‌ అంతే - ఏడాదిలోనే రెండంకెల లాభాలు