Famous Women Writers: తెలుగు సాహిత్య రంగంలో ఎందరో మహిళలు ప్రతిభ చూపారు. అప్పటి తరంలో తాళ్లపాక తిరుమలమ్మతో మొదలై శతాబ్దాలుగా తెలుగు సాహిత్య లోకానికి వన్నె తెస్తూ.. తమ రచనలతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, మహిళలపై ఆంక్షలున్న సమయంలో తమ సాహిత్యంతో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మహిళా రచయితలు వందల మంది ఉన్నారంటేనే తెలుగు సాహిత్యానికి అది గర్వకారణం. పద్య సాహిత్యం, వచన కవిత్వం, నవలలు, విప్లవ సాహిత్యం, కామెడీ రచనలు, కథలు ఏదైతేనేమీ అన్నిట్లోనూ తాము సైతం సత్తా చూపగలమని దూసుకెళ్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందుకుంటూ.. పత్రికలను సైతం నడిపిస్తున్నారు. స్త్రీ వాదంలో ఒరవడి తెస్తూ, ఎన్నో అడ్డంకులు, అవమానాలూ ఎదుర్కొంటున్నా మహిళా సమస్యలపై గళం విప్పుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి మహిళా రచయితలు, వారి రచనలపై ప్రత్యేక కథనం.


1. ఓల్గా


స్త్రీ వాద గళాన్ని బలంగా వినిపించిన రచయితల్లో ముందుండే పేరు ఓల్గా. ఈమె అసలు పేరు పోపూరి లలితకుమారి. మొదట పైగంబర కవిత్వంతో సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెట్టి, వచనంలో స్థిరపడి, స్త్రీ వాద సాహిత్యంలో ఒరవడి తెచ్చి, గౌరవ డాక్టరేట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులూ పొందారు. సహజ, స్వేచ్ఛ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం, గులాబీలు వంటి నవలలు రాశారు. రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న సందర్భాలు, మృణ్మయనాదం, విముక్త (కథాసంపుటి) ఆమె కథా సంకలనాలు. సామాన్యుల సాహసం, భూమి పుత్రిక మిస్సింగ్, మూడుతరాలు, పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం, ఉరికొయ్య అంచున, నేనూ సావిత్రిబాయిని, అక్షర యుద్ధాలు వంటి నువాదాలూ చేశారు. వీరి రచనల్లో అత్యంత పేరుగాంచిన 'విముక్త' రచనకు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (రూ.25 లక్షల నగదు పురస్కారం), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. వారి రచనలన్నింటికీ, ఇంకా ఎన్నెన్నో రివార్డులు పాఠకుల నుంచి వచ్చాయి. 'స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరి దయాదాక్షిణ్యం కాదు.. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం' అని 1987 లో స్త్రీ స్వేచ్ఛ గురించి ఓల్గా రాసిన 'స్వేచ్ఛ' అనే నవల అందరి ప్రశంసలు అందుకుంది.


2. కుప్పిలి పద్మ


ఆధునిక స్త్రీ వాద రచయితల్లో చెప్పుకోవాల్సిన పేరు కుప్పిలి పద్మ. ఆధునిక మహిళల సమస్యలను, ప్రపంచీకరణ పరిణామాలను, మానవ సంబంధాల మధ్య సంఘర్షణను తనదైన కోణంలో విశ్లేశించి ఎన్నో కథా సంపుటాలు రచించారు. ప్రస్తుత రోజుల్లో ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్యలో వచ్చిన మీటూ ఉద్యమంలో భాగంగా, "మీటూ" అనే కథల పుస్తకాన్ని రచించారు. "మనం ప్రపంచం కోసం మాట్లాడితే ప్రపంచం మన కోసం మాట్లాడుతుంది" అంటారు కుప్పిలి పద్మ. కథా స్రవంతి, ఎల్లో రిబ్బన్, కుప్పిలి పద్మ కథలు, పొగమంచు అడివి వంటి పుస్తకాలు రచించారు. పడగ నీడలో, గుల్మొహర్ అవెన్యు, అహల్య, మహిత, ప్రేమలేఖలు.. మొదలైన నవలలు ప్రసిద్ధి చెందాయి. సినారె పురస్కారం(2023),ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి సీతాదేవి అవార్డు  (2017),సాహితీ మాణిక్యం  అవార్డు (2016), దాట్ల  నారాయణ రాజు సాహితీ పురస్కారం (2015).. ఇంకా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.


3. పి.సత్యవతి


మహిళా రచయితల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన వారిలో ప్రముఖులు పి.సత్యవతి. కథలు, వ్యాసాలు, నవలలు, అనువాదాలు ఇలా ఒక్కటేమిటి.. ఏది రాసినా స్త్రీ జీవితాన్ని అద్దంలా చూపించటమే ధ్యేయంగా ఈమె రచనలు ఉంటాయి. ఆధునిక స్త్రీ వాద సాహిత్యంలో వీరిది ప్రత్యేక ఒరవడి. స్త్రీల జీవితాన్ని హింసామయం చేస్తున్న వ్యవస్థలను విమర్శించేలా ఈమె రచనా విధానం ఉంటుంది. ఇల్లలకగానే, సూపర్ మాం సిండ్రోం, దమయంతి కూతురు, గాంధారి రాగం వంటివి స్త్రీ వాదం వినిపించే వీరి ప్రముఖ రచనలు. "యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ అ ట్రాన్స్ జెండర్" పుస్తక అనువాదానికి గానూ, వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.


4. కె.యన్ మల్లీశ్వరి


ఈ తరం స్త్రీవాద రచయితల్లో స్త్రీల సమస్యల పరిష్కారానికి తన రచనలతో ఎంతగానో కృషి చేస్తున్న రచయితల్లో చెప్పుకోదగిన వారు.. కె.యన్.మల్లీశ్వరి. విశాఖ ఏజెన్సీలో మాడుగుల మండలంలోని వాకపల్లి గ్రామ మహిళల పోరాటానికి మద్దతుగా వ్యాసాలు రాస్తూ, వాకపల్లి సంఘటనను జాతీయ వేదిక మీదకు తీసుకెళ్లారు. లేడీ స్కాలర్, ప్రేమించడం ఒక కళ (నవల - 2000), భారతంలో స్త్రీ (నవల - 2002), అట్టడుగు స్వరం (నవల - 2005), జీవితానికో సాఫ్ట్ వేర్ (నవల - 2007), నీల (నవల - 2017), పెత్తనం (కథా సంపుటి - 2005) వంటి ఎన్నో రచనలు చేశారు. తానా నవలా బహుమతి – 2017 (నీల నవల), లాడ్లీ మీడియా అవార్డ్ – 2017 (జర్నలిజంలో), వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ అవార్డ్ (15 ఏప్రిల్, 2015), శ్రీమతి వెంకట సుబ్బు మెమోరియల్ అవార్డ్ (2015).. ఇలా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.


5. జూపాక సుభద్ర


కథలు, కవితలు, వ్యాసాలు, అనువాదాలు, నవలలు ఇలా జూపాక సుభద్ర రాయని ప్రక్రియ అంటూ ఏదీ లేదు. ఇటు ఉద్యమకారిణిగానూ పోరాటాలు చేస్తున్నారు. మహిళా సాహిత్యంలో అగ్రకుల భావజాలాన్ని ప్రశ్నించారు. సాహిత్యంలో తమదైన గళం విప్పి, సమస్యల మీద పోరాటం చేస్తున్న మహిళల్లో ఈమె ప్రముఖులు. నల్లరేగటిసాల్లు 2006, సంగతి (తమిళ్‌ నుంచి తెలుగు), కైతునకల దండెం 2008, అయ్యయ్యో దమ్మక్క 2009.. మొదలైన రచనలు చేశారు. మైత్రేయ కళాసమితి కథ పురస్కారం 2006, ఆంధ్రప్రదేశ్‌ భాషా కమిషన్‌ అవార్డు 2007, జీవీఆర్ కల్చరల్‌ పౌండేషన్‌ అవార్డు 2007.. వంటి వివిధ అవార్డులెన్నో అందుకున్నారు.


విజయ బండారు, జ్యోతి వలబోజు, పి. జ్యోతి, సుజాత వేల్పూరి, మానస ఎండ్లూరి, చైతన్య పింగళి, స్వర్ణ కిలారి, ఎండపల్లి భారతి, అపర్ణ తోట, అరుణ పప్పు, ఊహ, షాజహానా, నస్రీన్, రుబీనా పర్విన్, వినోదిని ఇంకా ఎందరెందరో ఈ తరం మహిళా రచయితలు పత్రికా సంపాదకులుగా, ఉద్యమకారిణులుగా, వ్యాసకర్తలుగా, పుస్తక రచయితలుగా, స్త్రీ వాద రచయితలుగా, సినీ పాటల రచయితలుగా రాణిస్తున్నారు. 'ఆడదానికి ఆడదే శత్రువు' అనే మాటను రీప్లేస్ చేసి "సిస్టర్ హుడ్" అంటూ, ఒకరి కోసం ఒకరు నిలుస్తూ, సమస్యల మీద ఒక్కరుగా కలిసి పోరాటం చేస్తూ, చర్చావేదికలను నిర్వహిస్తున్నారు. సాహిత్య లోకానికి, మహిళా జీవిత స్వావలంబనకు ఎనలేని కృషి చేస్తున్నారు. అలాంటి మహిళా రచయితలకు గౌరవ పూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.