నాలుగేళ్లు కలిసుండి, ఇప్పుడు కేస్ పెడితే ఎలా: సుప్రీం కోర్టు


సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. మహిళ ఇష్టపూర్వకంగా ఓ వ్యక్తితో సహజీవనం చేశాక, ఏదో ఓ కారణంగా గొడవైతే....ఆ వ్యక్తిపై అత్యాచార కేసు పెట్టటం సరికాదని తేల్చి చెప్పింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కేసుని విచారించే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఓ మహిళ నాలుగేళ్ల పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి, మనస్పర్ధలతో విడిపోయాక అతనిని అత్యాచార కేసు పెట్టింది. నాలుగేళ్ల క్రితం అతనితో సహజీవనం సాగించే సమయానికి, పిటిషన్‌దారుకి 21 ఏళ్లున్నాయని గుర్తు చేసింది ధర్మాసనం. ఇష్టపూర్వకంగానే అతనితో సహజీవనం చేసిందని, ఇప్పుడు ఉన్నట్టుండి అత్యాచార కేసు పెట్టడం కోర్టు ఒప్పుకోదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటమూ సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అన్సార్ మహమ్మద్‌...ప్రి అరెస్ట్ బెయిల్ వారెంట్ ఇవ్వాలని రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే రాజస్థాన్ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫలితంగా... సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు అన్సార్. 


అందుకే బెయిల్ ఇవ్వలేదు: రాజస్థాన్ హై కోర్టు


ప్రస్తుతానికి సర్వోన్నత న్యాయస్థానం అన్సార్ మహమ్మద్‌కు యాంటిసిపేటరీ బెయిల్ జారీ చేసింది. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. "రాజస్థాన్ హైకోర్ట్‌లో ఉన్న అప్పీల్‌కు కూడా అనుమతినిస్తున్నాం. ప్రస్తుతానికైతే బెయిల్‌పై అతడిని విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం" అని చెప్పింది. ప్రీ అరెస్ట్ బెయిల్ అప్లికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ విచారణ చేపట్టామని గుర్తు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తదుపరి విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. అంతకు ముందు రాజస్థాన్‌ కోర్ట్ బెయిల్‌ ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరించింది. "ఇద్దరూ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి, మహిళను పెళ్లాడతానని మాటిచ్చాడు. వీరిద్దరికీ ఓ అమ్మాయి కూడా పుట్టింది. ఈ కేసులోని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, యాంటిసిపేటరీ బెయిల్‌ ఇవ్వటం కుదరదని స్పష్టం చేస్తున్నాం. అందుకే ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం" అని రాజస్థాన్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు ఉద్దేశపూర్వకంగా, ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. మాయమాటలు చెప్పి, చివరకు మోసం చేసి,సెక్షన్ల పేరు చెప్పి తప్పించుకుంటున్నారని ఇంకొందరు మండిపడుతున్నారు. 
నిజానికి ఈ రెండు వాదనల్లోనూ నిజముంది. కానీ, న్యాయస్థానాలు అన్ని విధాల విచారణ జరిపాకే తీర్పునిస్తాయని, ఆ తీర్పుని గౌరవించక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. 


 Also Read: How much alcohol is unsafe : మద్యం తాగడం అందరికీ హానికరం కాదు కానీ షరతులు వర్తిస్తాయి ! ఇవిగో ఆశ్చర్యపోయే వాస్తవాలు