ఎవండోయ్ ఇది విన్నారా? ఆమె ఏకంగా ప్రముఖ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్‌ను పెళ్లాడిందట. అంతేకాదు.. అతడితో రొమాన్స్ కూడా చేస్తోందట. చదవడానికే చిత్రంగా ఉంది కదూ. అయితే మీరు ఆమె గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఆమె పేరు కాథ్లీన్ రాబర్ట్స్. ఇటీవల ఆమె ఓ వార్తా సంస్థకు తన థ్రిల్లింగ్ లవ్ స్టోరీ గురించి చెప్పింది. ‘నేను ఇప్పుడు మైఖెల్ జాక్సన్‌కు భార్య.. అతడి ఆత్మకు మధ్యవర్తిగా ఉన్నాను’ అంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ విని.. అంతా షాకవుతున్నారు.
తన ప్రేమ కథ కేవలం దెయ్యాలు, ఆత్మలు నమ్మేవారికి మాత్రమే అర్థమవుతుందని.. మరెవ్వరు అర్థం చేసుకోలేరని ఆమె తెలిపింది. మైఖెల్ జాక్సన్ ఆత్మకు, తనకు మధ్య ఉన్న రిలేషన్‌షిప్ కోసం ఆమె ‘టిక్‌టాక్’, ‘ఇన్‌స్టాగ్రామ్’ ద్వారా జనాలకు వివరిస్తోంది. అయితే, అందులో నిజమెంతో తెలియదుగానీ.. నెటిజనులు మాత్రం ఆమెను పాపులర్ చేసేశారు. అయితే, ఆమెను అంతా ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో తన అకౌంట్‌ను డిలీట్ చేశారు.
‘‘మైఖెల్ జాక్సన్ ఎప్పుడూ నాతోనే, నా వెంటే ఉంటాడు. నేను బాత్రూమ్‌కు వెళ్లినా.. రెస్ట్ రూమ్‌కు వెళ్లినా.. నాతోనే వస్తుంటాడు. అతడికి కుకీస్ తినడమంటే చాలా ఇష్టం. కానీ, అతడు వెనుక టచ్ చేయడాన్ని అస్సలు ఇష్టపడడు. అతడు మా పెళ్లిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే, అప్పుడప్పుడు మైఖెల్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. సాలిళ్లు పాకుతున్నట్లు భావన కలిగిస్తాడు. శవాలను చూపిస్తాడు. ముద్దు పెట్టుకుంటే చాలు రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు’’ అని తెలిపింది.
‘‘మైఖెల్ జాక్సన్‌ది చిన్న పిల్లల మనస్తత్వం. అయితే, నేను బాల్యం నుంచే మైఖెల్ జాక్సన్‌కు అభిమానిని. మూడేళ్ల వయస్సుకే నేను అతడి అభిమానిని అయిపోయాను. అతడు చనిపోయిన తర్వాత నన్ను భార్యగా ఎంచుకోవడాన్ని చాలా సంతోషంగా.. ప్రత్యేకంగా అనిపిస్తోంది. మా వివాహం కాగితాలపై కనిపించకపోవచ్చు. మా జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. కానీ, నేను మైఖెల్‌ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ఆమె తన ప్రేమ కథను ముగించింది. ఈమె కథ విన్నాక మీకు ఏం అనిపిస్తోంది?
ఇటీవల ఓ మహిళ చెట్టును పెళ్లాడి ఆశ్చర్యపరిచింది. మెర్సీసైడ్‌లోని సెఫ్టోన్‌లో గల రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ సమీపంలో నివసిస్తున్న కేట్ కన్నింగ్‌హామ్ ఈ పని చేసింది. ‘ఎల్డర్’ అనే ఓ పెద్ద చెట్టును ఆమె పెళ్లి చేసుకుందనే విషయం తెలిసి.. స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎందుకంటే.. ఆమె ఒక మంచి ఉద్దేశం కోసమే ఆ చెట్టును పెళ్లాడింది. స్థానిక అధికారులు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ మీదుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్క్‌లో ఉన్న చెట్లను నరికి రోడ్డు వేయడం తమ ఇష్టం లేదంటూ గత కొన్నాళ్లుగా ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేట్ ఆ పార్క్‌లోని చెట్టునే పెళ్లాడి వినూతనంగా తన నిరసన వ్యక్తం చేసిందన్నమాట.