Lok Sabha Polls 2024: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ I.N.D.I.A కూటమి ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi on EVMs) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈలోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుస్తామని చెబుతోందని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లాటిందేనని విమర్శించారు. EVMలను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని తేల్చి చెప్పారు. ఈసారి ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌లతో ఈ లోక్‌సభ ఎన్నికల్ని పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైర్‌లపై ఒత్తిడి పెంచడం, ఆటగాళ్లను కొనేయడం, గెలవకపోతే కుదరదంటూ కేప్టెన్‌లని బెదిరించడం లాంటివి జరుగుతుంటాయని ఆరోపించారు రాహుల్. లోక్‌సభ ఎన్నికలు కూడా ఐపీఎల్ మ్యాచ్ లాంటిదేనని, ప్రధాని మోదీ అంపైర్స్‌ని ఎంపిక చేసి అందరిపైనా ఒత్తిడి తెస్తున్నారంటూ పరోక్షంగా దర్యాప్తు సంస్థలపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల వివాదాన్ని ప్రస్తావించారు. అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశాన్ని మంటల్లో నెట్టేస్తారని మండి పడ్డారు రాహుల్ గాంధీ.
"ఈవీఎమ్‌లు లేకపోతే, మ్యాచ్ ఫిక్సింగ్ జరగకపోతే, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోకపోతే, మీడియాపై ఒత్తిడి చేయకపోతే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలుచుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో కేప్టెన్‌లను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ప్రధాని మోదీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంపైర్‌లను ఆయనే ఎంపిక చేసి ప్లేయర్స్‌ని అరెస్ట్ చేయిస్తున్నారు. దేశంలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేయించారు. మేం ప్రచారం చేయాలన్నా చిల్లిగవ్వ లేకుండా పోయింది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశాన్ని మంటల్లో నెట్టేస్తారని మండి పడ్డారు రాహుల్ గాంధీ. ఈ సారి ఎన్నికలు అత్యంత కీలకమైనవని, దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు రావడంతో పాటు దేశమూ ధ్వంసమైపోతుందని తేల్చి చెప్పారు.
"ఈ ఎన్నికలు చాలా కీలమైనవి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయమిది. ఓటర్లు ఆలోచించకుండా ఓటు వేస్తే వాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ సక్సెస్ అవుతుంది. అదే జరిగితే వాళ్లు రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. ప్రజలకు గొంతుకనిచ్చే రాజ్యాంగాన్ని మార్చేసి దేశాన్ని ధ్వంసం చేస్తారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత