Rashmika Mandanna Praises Atal Setu: పాలిటిక్స్‌కి కూడా కాస్తంత గ్లామర్ అవసరమే. అందుకే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయిస్తాయి పార్టీలు. అవసరమైతే సినీ నటులకు టికెట్ ఇచ్చి మరీ బరిలోకి దింపుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్నికల రంగంలోకి దిగారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఎప్పటి నుంచో బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారామె. ప్రత్యక్ష రాజకీయాల్లో రాక ముందు నుంచే మోదీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. పాలిటిక్స్‌పై తనకున్న ఆసక్తిపైనా హింట్స్ ఇచ్చారు. కంగనా బీజేపీలో చేరిపోతారంటూ అందరూ అనుకున్నట్టుగానే ఆమె ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. అప్పటి నుంచి ఆమే స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఉత్తరాది సంగతి. దక్షిణాదిలో ఉనికిని నిలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ..సౌత్ స్టార్స్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్నని రంగంలోకి దింపింది. ఎన్నికల కోసం ఆమెతో ఓ స్పెషల్ వీడియో షూట్ చేసింది. భారత్‌లోనే అత్యంత పొడవైన హార్బర్ లింక్ అటల్ సేతుని (Atal Setu Sea Bridge) ప్రమోట్ చేసింది. "వికసిత్ భారత్‌కి ఇది సంకేతం, అభివృద్ధికి ఓటు వేయండి" ఈ వీడియో లాస్ట్‌లో రష్మిక పిలుపునిచ్చింది. ఎక్కడా ప్రభుత్వం పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా ఇది బీజేపీకి ప్రచారం చేసినట్టే ఉంది. ఈ ఒక్క వీడియోతో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంగనా లాగే రష్మిక మందన్న కూడా బీజేపీతోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అన్న గుసగుసలూ మొదలయ్యాయి.
ఇటీవలే కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యాయి. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవి చూసింది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా...ఆ తరవాతైనా కర్ణాటకలో మళ్లీ పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. మిషన్ సౌత్‌లో భాగంగానే కన్నడ మూలాలున్న రష్మిక మందన్నతో క్యాంపెయినింగ్ మొదలు పెట్టారన్నది మరో వాదన. ఎప్పుడూ పొలిటికల్ కామెంట్స్ చేయని రష్మిక ఏకంగా మీడియా ముందుకు వచ్చి మోదీ హయాంలో అద్భుతాలు జరిగాయంటూ ప్రశంసలు కురిపించింది. "బ్రిలియంట్" అంటూ ఆకాశానికెత్తేసింది. ఈ స్థాయిలో పొగడడమే హాట్ టాపిక్ అవుతోంది.
కేవలం యాడ్ కోసమే ఆమెతో ఇదంతా షూట్ చేయించి ఉంటారని, రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్న రెండో వాదన కూడా ఉంది. ఇందులో ఓ వాదన నిజం అన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు. కంగనా కూడా గతంలో ఇలాగే మోదీ సర్కార్‌కి గట్టిగానే ప్రచారం చేసింది. ఆ తరవాత ఆ పార్టీ ఐడియాలజీ నచ్చిందంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగింది. ఇప్పుడు రష్మిక మందన్న విషయంలోనూ అదే జరిగే అవకాశాలున్నాయా అన్న అనుమానాలకు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ అనుమానాలు నిజమవుతాయా..? బీజేపీ ప్లాన్ ఏంటన్నది తేలాలంటే వేచి చూడక తప్పదు.
Also Read: PM Modi: బుల్‌డోజర్ ఎక్కడ వాడాలో యోగిని చూసి నేర్చుకోండి, ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు