Priyanka Gandhi to Contest From Wayanad: వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ రెండు చోట్లా విజయం సాధించారు. అయితే...ఆయన వయనాడ్ ఎంపీగా రాజీనామా చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే నిజమైతే అక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయం. ఈ ఉప ఎన్నికల బరిలోనే ప్రియాంక గాంధీ నిలబడతారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల్లో ఈ విషయం బాగానే చక్కర్లు కొడుతోంది. యూపీలోని రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట. అందుకే అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగి వయనాడ్ నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. నిజానికి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ 2019 నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని దాదాపు అంతా ఖరారు చేసుకున్నారు. కానీ...చివర్లో రాహుల్ పేరునే ప్రకటించింది హైకమాండ్. ఆ సమయంలోనే మీడియా ప్రియాంకను ప్రశ్నించింది. ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించగా రాహుల్‌తో పాటు తాను కూడా పోటీ చేస్తే ప్రచారానికి సమయం ఎక్కువ కేటాయించలేమని వెల్లడించారు. ఇద్దరమూ చెరో చోట ప్రచారం చేయడం కన్నా ఒకే చోట చేయడం వల్ల పార్టీకి కలిసి వస్తుందని, అందుకే పోటీ చేయడానికి తాను ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు.
స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక..
2022లో యూపీ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా ఆమె మాత్రం బరిలో దిగలేదు. ఆ సమయానికి యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరవాత ఎన్నికల్లో పాల్గొనాలన్న ఆలోచనే చేయలేదు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లకు మళ్లీ అదే ప్రచారం జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు ప్రియాంక. రాహుల్‌తో సమానంగా అన్ని చోట్లా క్యాంపెయిన్ చేశారు. యూపీలో ఈ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించింది. బీజేపీకి ఇండీ కూటమి షాక్ ఇచ్చింది. 43 చోట్ల విజయం సాధించింది. ఇదంతా ప్రచారం వల్లే సాధ్యమైందని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే...రెండు చోట్ల గెలిచిన రాహుల్ మాత్రం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి చవి చూసిన రాహుల్‌కి వయనాడ్ గెలుపు చాలా ఊరటనిచ్చింది. అలాంటి నియోజకవర్గాన్ని ఎలా వదులుకోవాలి అని ఆలోచనలో పడ్డారు. ఇక రాయ్‌బరేలీ విషయానికొస్తే అది కంచుకోట. ఇక్కడి ప్రజలు గాంధీ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎలా తప్పుకోవాలో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి సమయంలోనే ఆయన వయనాడ్ ఎంపీగా రాజీనామా చేస్తారన్న వార్తలు చర్చకు దారి తీశాయి. ఊహాగానాలు నిజమై ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తే ఆమె గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ప్రియాంక గాంధీ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
Also Read: Kuwait Fire Tragedy: కువైట్ అగ్ని ప్రమాదం - 45 మంది మృతదేహాలతో కొచ్చిన్ చేరుకున్న ప్రత్యేక విమానం