New Parliament Opening: 


పార్లమెంట్‌ ఓపెనింగ్‌కి విపక్షాల దూరం..


ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ చరిత్రలో ఇదో అపురూప ఘట్టం అని మోదీ సర్కార్ చెబుతోంది. కానీ విపక్షాలు మాత్రం దీనిపై మండి పడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కన పెట్టి ప్రధాని మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అంతే కాదు. ఆ రోజున జరిగే కార్యక్రమానికి హాజరు కాకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే 19 పార్టీలు ఈ మేరకు అధికారికంగా ఓ లేఖనీ విడుదల చేశాయి. అయితే...ఈ నిర్ణయంపై బీజేపీ కూడా గట్టిగానే బదులిస్తోంది. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండి పడ్డారు. ప్రతిదీ రాజకీయం చేస్తారా అంటూ అశహనం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్‌లతో ఫైర్ అయ్యారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్నీ  బైకాట్ చేస్తారా అని ప్రశ్నించారు. 


"ఈ ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బైకాట్ చేశాయి. రేపు అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్నీ బైకాట్ చేస్తారా..?"


- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం






ఇదే అంశంపై బీజేపీ నేతృత్వంలోని NDA తీవ్రంగా స్పందించింది. ప్రతిపక్షాలు  బైకాట్ చేయడాన్ని తప్పుబట్టింది. అధికారికంగా ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. 


"పార్లమెట్ ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బైకాట్ చేయడాన్ని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకే ఇది అవమానం"


- ఎన్‌డీఏ 


ఇప్పటికే విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు హిమంత. గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని వాళ్లు అనుకోలేదని, ఇప్పుడది సాధ్యమయ్యే సరికి ఏం చేయాలో అర్థంకాక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. 


"ఇలా బైకాట్ చేస్తారని తెలిసిందే. కొత్త పార్లమెంట్‌ని కట్టడం వాళ్లకు ఇష్టం లేదు. ఇంత తొందరగా నిర్మాణం పూర్తవుతుందని వాళ్లు ఊహించలేదు. కానీ...గడువులోగా ఇది పూర్తైంది. ఇది చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. మొహం చూయించుకోలేకే..ఇలా బైకాట్ అని నాటకాలు చేస్తున్నారు. వీరసావర్క్‌కి సంబంధించిన ఓ కీలక తేదీ రోజునే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నాం. బహుశా ఇది కూడా వాళ్లను ఇబ్బంది పెడుతుందేమో'


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి