భాజపా,మా ఉనికి లేకుండా చేయాలని చూస్తోంది: ఉద్దవ్ థాక్రే
"వెళ్లిపోవాలనుకునే వాళ్లు వెళ్లిపోవచ్చు,నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కొత్త శివసేనను సృష్టించే పనిలో ఉన్నాను" అని అంటున్నారుఉద్దవ్ థాక్రే. ఈ కుట్ర వెనకాల భాజపా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీపైనా విరుచుకుపడ్డారు థాక్రే. భాజపా,షిండేకుమ్మక్కై శివసేన నేతల్ని లాక్కుపోతున్నారని, తమ పార్టీ ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగానే కొత్త శివసేననుసృష్టిస్తానంటూ వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యులే తనకు ఆస్తి అని, తనపై వచ్చే విమర్శల్ని అసలు పట్టించుకోని స్పష్టం చేశారు థాక్రే. శివసేనను సొంత వాళ్లే మోసం చేస్తున్నారంటూ షిండేని ఉద్దేశిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై పార్టీ కార్యకర్తల్తో
వర్చువల్‌గా సమావేశమైన ఆయన ఇంత కఠినమైన సమయంలోనూ అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
శిక్షలు తప్పించుకునేందుకే భాజపా వైపు..
"మా కూటమిలో ఏదో జరుగుతోందని, మిగతా పక్షాలు ఏయే అంశాల్లో అసహనంగా ఉన్నాయో తెలుసుకోవాలని గతంలోనే షిండేతో నేను మాట్లాడాను. శివసేన భాజపాతో చేతులు కలపాలనే చాలా మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని షిండే నాతో చెప్పారు. కానీ నేను అందుకు అంగీకరించలేదు. ఎవరైతే అలా కోరుకుంటున్నారో వాళ్లందరితోనూ మాట్లాడతానని చెప్పాను. భాజపా మా ఆశల్ని, ఆశయాల్ని పట్టించుకోలేదు. హామీల్నీ నెరవేర్చ లేదు. ఇప్పుడు షిండే శిబిరానికి వెళ్లిన వారందరిపైనా కేసులున్నాయి. వాటిని మాఫీ చేసుకునేందుకే భాజపా చెప్పినట్టుగా ఆడుతున్నారు. మాతో ఉంటే శిక్ష పడక తప్పదనే ఇలా చేస్తున్నారు" అని అన్నారు థాక్రే.
అడిగితే ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాడిని..
"నాతో ఓ మాట చెప్పి ఉంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ప్రయత్నించే వాడిని కదా" అంటూ షిండేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజానికి ఎప్పుడో షిండే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని, ఇప్పుడు సందర్భం రాగానే వెళ్లిపోయాడని అన్నారు. హిందూ ఓట్ బ్యాంక్‌నిచీల్చటం ఇష్టం లేకే భాజపా ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు థాక్రే. ఇప్పటికిప్పుడు భాజపాతో చేతులు కలిపి షిండే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవలేదని, చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారని అన్నారు. ఈరెబల్స్ నేతలు వచ్చే ఎన్నికల్లో గెలవటం అసాధ్యమని చెప్పారు.
ప్రస్తుతానికి ఏక్‌నాథ్ షిండేకి ఎమ్మెల్యేల మద్దతు బాగానే ఉంది. ఈ వారాంతం గడిచేలోగా వారి సంఖ్య 50కి చేరనుందని అంచనా. అదే నిజమైతే ప్రభుత్వం ఏర్పాటు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే వీరిలో ఎంత మంది స్థిరంగా ఉంటారు అన్న విషయంలో ఇంకా స్పష్టతరావాల్సి ఉంది.