Ram Mandir Opening: 


అయోధ్య వేడుకకు నిత్యానంద..


స్వామి నిత్యానందకూ అయోధ్య వేడుకకు (Ayodhya Ram Mandir Opening) ఆహ్వానం అందింది. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతే కాదు. ఈ ఉత్సవానికి తాను వెళ్తున్నట్టు ప్రకటించారు. తనను తానుగా దైవాంశసంభూతుడునని చెప్పుకునే నిత్యానంద ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలూ ఉన్నాయి. ఆ వివాదాల తరవాత ఆయన ప్రత్యేకంగా Kailasa అనే ద్వీపాన్ని కొనుగోలు చేశారు. అదే తన దేశమని ప్రచారం చేశారు. అయోధ్య ఉత్సవానికి ముందు నిత్యానంద X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి చారిత్రక ఘట్టాన్ని చూసే అవకాశం వస్తే ఎవరూ మిస్ అవ్వద్దు అని సూచించారు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించేందుకు రాముడు అయోధ్యలో కొలువుదీరనున్నాడని అన్నారు. 


"ఇలాంటి అద్భుతమైన, చారిత్రక ఘట్టాన్ని చూసే అవకాశాన్ని ఎవరూ కోల్పోవద్దు. అయోధ్య ఆలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయన ఆశీర్వదించనున్నారు. నాకూ ఈ వేడుకకు ఆహ్వానం అందింది. ఈ ఉత్సవానికి తప్పకుండా హాజరవుతాను"


- స్వామి నిత్యానంద






2010లో కార్‌ డ్రైవర్‌ ఫిర్యాదుతో స్వామి నిత్యానందపై విచారణ జరిగింది. ఆయనను అరెస్ట్ కూడా చేశారు. ఆ తరవాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2020లో ఆ డ్రైవర్‌ సంచలన విషయం వెల్లడించాడు. నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని చెప్పాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రధాన మంత్రిగా తన ప్రియ శిష్యురాలు అయిన రంజితను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసినట్లు ఓ తమిళ పత్రిక ప్రకటించింది. అంతేకాదు, నిత్యానంద వెబ్ సైట్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ వార్త బయటకు తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ప్రస్తుతం నిత్యానంద వెబ్ సైట్ లో నిత్యానందతో పాటు, రంజిత ఫోటోలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. రంజిత తన పేరును సైతం మార్చుకుంది. నిత్యానందమయి స్వామిగా ప్రకటించుకుంది. మొత్తంగా హిందువుల కోసం ఏర్పాటు అయిన కైలాస దేశానికి రంజిత తొలి ప్రధానిగా నియమితం అయ్యింది. అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కైలాస దేశం నుంచి కొంత మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని బాగా పాపులర్ అయ్యింది.