HanuMan Movie: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ రోజు రోజుకు మరింత ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వసూళ్లు అందుకుంటోంది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, రూ. 200 కోట్ల మార్క్ ను చేరుకునే దిశగా పయనిస్తోంది. ఈ మూవీ రెండో వారంలోనూ మంచి ఆక్యుపెన్సీని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో  అయోధ్య భవ్య రామ మందిరానికి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటి వరకు అమ్ముడైన ప్రతి టికెన్ నుంచి రూ. 5 రామయ్యకు అందజేయనున్నట్లు తెలిపింది.


అయోధ్య రామయ్యకు ‘హనుమాన్’ టీమ్ భారీ విరాళం


నిజానికి ‘హనుమాన్’ సినిమా విడుదలకు ముందే చిత్రబృందం కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించి అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి రూ. 5 రూపాయలు అయోధ్య శ్రీరాముడి ఆలయానికి అందించనున్నట్లు తెలిపింది. తాజాగా అన్న మాటను నిలబెట్టుకుంది. ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది.  సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు.  ‘హనుమాన్‌ ఫర్‌ శ్రీరామ్‌’ అంటూ ఈ మేరకు ఓ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ నిర్ణయంతో చిత్రబృందంతోపాటు, నిర్మాత నిరంజన్‌ రెడ్డిని సినీ ప్రియులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.






ప్రేక్షకులను ఆకట్టుకున్న విజువల్‌ ఎఫెక్ట్స్‌


తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ మూవీలో  అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కోటి  అనే కోతికి స్టార్ హీరో రవితేజ వాయిస్‌ ఇవ్వడం విశేషం. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఓ సాధారణ యువకుడికి ‘హనుమాన్’ ద్వారా పవర్స్ వస్తే, వాటిని ఎలా ఉపయోగించాడు అనేది ఈ సినిమాలో చూపించారు. సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ మూవీలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమా అద్భుతం అంటూ ప్రశంసించారు.


Read Also: డీప్ ఫేక్ వీడియో కేసు నిందితుడు అరెస్ట్, రష్మిక రియాక్షన్ ఇదే!