Shock when hands shake : ఆఫీసులో ఎవరికి అయినా మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇస్తే వెంటనే షాక్ కొట్టడం అనేది ఇప్పుడు చాలా మందికి అనుభవపూర్వకమైన విషయం. ఒక్కోసారి ఆఫీసులో కుర్చీని పట్టుకున్నా.. క్యాంటీన్‌కు వెళ్లినా ఇలాగే షాక్ కొడుతూ ఉంటుంది. చాలా మంది తాము ఉన్న భవనానికి ఎర్తింగ్ లేదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీన్ని స్టాటిక్ షాక్ అంటారు.
ఎలక్ట్రాన్ ల వల్ల స్టాటిక్ షాక్ వచ్చే అవకాశం
స్టాటిక్ షాక్ ను స్థిర విద్యుత్ షాక్ అని కూడా పిలుస్తారు. ఇది రెండు వస్తువులు ఒకదానితో ఒకటి కలసినప్పుడు లేదా విడిపోయినప్పుడు స్థిర విద్యుత్ ల్ల సంభవిస్తుంది. ఈ షాక్ సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది . ఉన్ని దుస్తులు మరియు చర్మం ఒకదానితో ఒకటి రుద్దుకోవడం వల్ల ఎలక్ట్రాన్‌లు ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు బదిలీ అవుతాయి. దీనివల్ల ఒక వస్తువు పాజిటివ్ ఛార్జ్‌ను , మరొకటి నెగటివ్ ఛార్జ్‌ను వెలువరిస్తుంది. ఈ ఛార్జ్‌తో ఉన్న వస్తువు మరొక వస్తువును తాకినప్పుడు లేదా దగ్గరగా వచ్చినప్పుడు ఎలక్ట్రాన్‌లు వేగంగా బదిలీ అవుతాయి. ఈ బదిలీ ప్రక్రియలో స్టాటిక్ షాక్ తగిలే అవకాశం ఉంది.
పొడి వాతావరణంలో ఎక్కువగా స్టాటిక్ షాక్
స్టాటిక్ షాక్ తరచూ పొడి వాతావరణంలో ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే తేమ లేనప్పుడు ఎలక్ట్రాన్‌లు సులభంగా బదిలీ అవుతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలిలోని నీటి ఆవిరి ఈ ఛార్జ్‌ను తటస్థీకరిస్తుంది, షాక్ జరిగే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నివారణ కోసం హ్యూమిడిఫైయర్‌లను ఉపయోగించి గదిలో తేమను పెంచే ప్రయత్నం చేయాలి. చర్మంపై మాయిశ్చరైజర్ వాడడం లేదా సహజ ఫైబర్ దుస్తులు ధరించాలి. లోహ వస్తువును తాకే ముందు ఛార్జ్‌ను డిస్చార్జ్ చేయడానికి నీటితో తడిచిన చేతులు ఉపయోగించడం చేయాలి.
స్టాటిక్ షాక్ ప్రమాదకరం కాదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి !
స్టాటిక్ షాక్ సాధారణంగా ప్రమాదకరం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంట్లో, ఆఫీసులో ఉన్నప్పుడు దళసరిగా ఉండే సాక్స్ ధరించకుండా అసలు సాక్స్ లేకుండా నడిస్తే మంచిది.నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. యాంటీ స్టాటిక్ పరికరాలు కూడా అమ్ముతున్నారు.