Andhra Pradesh News: ఏపీలో ఫలితాలు వచ్చేశాయి. 164 స్థానాలు గెలుచుకుని... భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి. అయితే... ఇప్పుడు హాట్‌టాపిక్‌ మాత్రం మంత్రివర్గం కూర్పే. కూటమి  తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీలోని సీనియర్లతోపాటు... బీజేపీ, జనసేన నుంచి గెలిచిన నేతలు నేతలు కూడా కేబినెట్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. లాబీయింగ్‌లు కూబా  మొదలు పెట్టేసినట్టు సమాచారం. మరి... మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి. చంద్రబాబు.. తన కేబినెట్‌లో ఎవరెవరికి చోటు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది.


164 స్థానాలు గెలుచుకున్న కూటమికి... మంత్రి పదవుల కేటాయింపు కత్తిమీద సాము లాంటిదే. కూటమిలో పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో చాలా మంది సీనియర్‌ నేతలు ఉన్నారు. వారంతా  మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే.. మంత్రి పదవులకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే కొంత కసరత్తు చేశారని... ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీ సీనియర్లకు... సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి పదువులు ఇచ్చే అవకాశం  ఉందని సమాచారం. ఈ లిస్ట్‌లో.. చంద్రబాబు తనయకుడు నారా లోకేష్‌తో పాటు టీడీపీ సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయ అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర వంటి  నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. 


జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా
ముఖ్యంగా... విశాఖ. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేద్దామనుకుంది. కానీ... ఆ జిల్లాలోని 15 స్థానాల్లో 13 సీట్లు కూటమి గెలుచుకుంది. దీంతో... విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా చాంతాడంత  ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు, నర్సీపట్నం నుంచి ఏడోసారి గెలిచిన అయ్యన్నపాత్రుడు, గాజువాక నుంచి టీడీపీ తరపున  రెండోసారి గెలిచిన పల్లా శ్రీనివాసరావు, పాయకరావుపేట నుంచి రెండోసారి విజయం సాధించిన వంగలపూడి అనిత, మాడుగుల నుంచి గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.... వీరంతా మంత్రి పదవులు తమకే వస్తాయని గట్టిగా నమ్మకం  పెట్టుకున్నారు. 


శ్రీకాకుళం జిల్లా నుంచి కింజారపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌, బెందాళం అశోక్‌ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు, తూర్పుగోదావరి జిల్లా నుంచి జ్యోతుల  నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పశ్చిమగోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్‌, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణంరాజు, కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, బోండా ఉమా, గద్దె  రామ్మోహన్‌, వసంత కృష్ణప్రసాద్‌, కేపీ సారథి....


గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్‌, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు... ప్రకాశం జిల్లా నుంచి దామరచర్ల జనార్దన్‌, గొట్టిపాటి రవికుమార్‌... నెల్లూరు జిల్లా నుంచి పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎన్‌ఎండీ ఫరూఖ్‌... అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు....


చిత్తూరు జిల్లా నుంచి పులివర్తి నాని, అమర్‌నాథ్‌రెడ్డి, బొజ్జల సుధీర్‌.... కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి... మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరంతా... టీడీపీ నుంచి మంత్రి పదవులు  ఆశిస్తున్నవారు. ఇక.. కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ నుంచి గెలిచి నేతలకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంది. దీంతో మంత్రివర్గ కూర్పు.. చంద్రబాబుకు అంత ఈజీ కాదు. మరి వీరిలో ఎవరెవరికి చంద్రబాబు మంత్రి పదవులు  ఇస్తారో చూడాలి.