Monkeypox New Name: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్‌' అని పిలవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసింది. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది.




ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగిస్తారు. డబ్ల్యూహెచ్‌ఓ ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఎందుకు?


ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్‌లైన్‌లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ కొత్తపేరును ఖరారు చేసింది.


టెన్షన్


మంకీపాక్స్ సోకిన వారిలో చర్మ సమస్యలు, దద్దుర్లతో పాటూ ఇంకా అనేక లక్షణాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. వైద్యులు చెప్పిన ప్రకారం మంకీపాక్స్ సోకిన కొంతమందిలో జననేంద్రియాల వద్ద దద్దుర్లు, నోటిలో పుండ్లు, పాయువుపై దద్దుర్లు కూడా వస్తున్నాయి. ఈ మూడు కొత్త లక్షణాలను మంకీపాక్స్ లక్షణాలుగా గుర్తించారు వైద్యులు. 


అధ్యయనంలో భాగంగా పది మంది మంకీ పాక్స్ సోకిన వారిని ఎంపిక చేసుకున్నారు. వారిలో ఒకరికి జననేంద్రియాల వద్ద దద్దుర్లు వచ్చాయని గుర్తించారు. కొంతమంది కూర్చోవడానికి నొప్పితో ఇబ్బంది పడ్డారు. మంకీపాక్స్ లక్షణాలు సిఫిలిస్ లేదా హెర్పెస్ వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల మాదిరిగానే ఉన్నాయి. అందుకే ఈ లక్షణాలను మంకీపాక్స్ గా కాకుండా చాలా మంది లైంగిక వ్యాధులుగా గుర్తిస్తున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్టు భావిస్తున్నారు పరిశోధకులు. 


మంకీపాక్స్ కేవలం లైంగికంగా మాత్రమే సంక్రమించే వ్యాధి కాదని, అది ఎలాంటి దగ్గరి శారీరక సంబంధం ద్వారానైనా సంక్రమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయాలని అభిప్రాయపడుతున్నారు. మంకీ పాక్స్ చాప కింద నీరులా పాకేస్తోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.