Mpox Vaccine: ప్రపంచదేశాలను ముఖ్యంగా ఆఫ్రికాను గడగడలాడిస్తున్న ఎంపాక్స్‌కు వ్యాక్సిన్ రెడీ అయింది. డెన్మార్క్‌ దేశంలోని బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సినియా అంకారా- బవేరియన్ నార్డిక్‌ టీకా అత్యవసర వినియోగానికి వ్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.  రెండు డోసుల్లో వ్యాక్సినేషన్ జరగనుండగా.. రెండు డోసులకు మధ్య 4 వారాల విరామం ఉండాలని డబ్య్లూహెచ్‌ఓ సూచించింది. ఈ టీకా 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో 8 వారాల వరకు నిల్వ ఉంటుంది. ప్రస్తుతానికి పెద్దవాళ్లకు మాత్రమే ఈ టీకా ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చిన ఆరోగ్య సంస్థ.. వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చిన్నారులకు, గర్భిణీలకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో టీకా ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతించింది.


ఈ టీకా ప్రభుత్వాలు ఎలా పొందొచ్చు:


 ఈ టీకాను డెన్మార్క్‌ ఫార్మా సంస్థ బవేరియన్ నార్డిక్ అభివృద్ధి చేస్తుండగా.. ప్రభుత్వాలు నేరుగా కొనుగోలు చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రభుత్వాలతో పాటు GAVI సంస్థ ద్వారా సేకరించేందుకు అనుమతులు ఉన్నట్లు పేర్కొంది. ఈ టీకాను ప్రస్తుతం    ఒక్క సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా.. టీకా అత్యవసరమైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు WHO తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఈ టీకా తొలి డోసులో 76 శాతం రెండో డోసు తీసుకున్న వారిలో 86 శాతం ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఈ టీకాతో పాటు జపాన్ సంస్థ KM బయోలాజిక్స్  అభివృద్ధి చేసిన LC16 టీకాను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరీక్షిస్తోంది. డెన్మార్క్ టీకా అందుబాటులోకి రావడంతో మంకీ పాక్స్‌పై యుద్ధంలో ఒక ముందడుగు పడ్డట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ .. ఈ ప్రాణాంతక వైరస్‌ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. ఇప్పటికే వైరస్‌తో అతలాకుతలం అవుతున్న కాంగోకు ఒక బ్యాచ్‌ వ్యాక్సిన్‌లు కూడా పంపినట్లు వెల్లడించింది.






అత్యధికంగా పిల్లలే ఎంపాక్స్ బాధితులు:


 ఎంపాక్స్‌ వైరస్‌ ఎక్కువగా  పిల్లల్లోనే విస్తరిస్తోంది. కాంగోలో గడచిన వారం రోజుల్లో నమోదైన ఎఁపాక్స్ కేసుల్లో 70 శాతం మంది బాధితులు 18ఏళ్లలోపు వారే. ఆఫ్రికా దేశాల్లో ఇదే వ్యవధిలో 3 వేల 160  మంది కొత్తగా ఎంపాక్స్‌  బారిన పడగా  107 మరణాలు నమోదయ్యాయి. 2024లో ఇప్పటి వరకూ 26వేల 543 అనుమానిత కేసులు నమోదు కాగా.. 5 వేల 732 మందిపై ఎంపాక్స్ తీవ్ర ప్రభావం చూపింది. వారిలో 724 మంది మృత్యువాత పడినట్లు ది ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. ఈ మహమ్మారి కట్టడికి పారిశుద్ధ్య చర్యలతో పాటు ముందస్తు గుర్తింపునకు టెస్టుల సంఖ్య పెంచాల్సి ఉందని వివరించింది. 15 ఆఫ్రికా దేళాల్లో ఈ కేసులు అధికంగా నమోదవతుండగా.. అందులో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు 40 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. మరణాల రేటు కూడా 2.83శాతంగా ఉందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడం ద్వారా ఈ వైరస్‌ విస్తరణను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఈ వైరస్‌ .. కరోనా మాదిరి గాలి ద్వారా వ్యాప్తి చెందదని నిపుణులు వెల్లడించారు.


Also Read: ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే