Pavel Durov Arrested: బిలియనీర్, టెలిగ్రామ్ సీఈవో పావేల్ దురోవ్‌ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్‌లో ఎయిర్‌పోర్ట్ బయటే ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు CNN వెల్లడించింది. టెలిగ్రామ్ యాప్‌లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మనీ లాండరింగ్‌తో పాటు డ్రగ్ ట్రాఫికింగ్ కూడా కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. అశ్లీల కంటెంట్ పెద్ద ఎత్తున ఈ యాప్‌లో షేర్ అవుతోందన్న ఆరోపణలతో పోలీసులు పావేల్‌ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ ఫౌండర్ గురించి అంతా గూగుల్ చేస్తున్నారు. ఏం జరిగింది..? బ్యాగ్రౌండ్ ఏంటని ఆరా తీస్తున్నారు. 39 ఏళ్ల పావేల్ దురోవ్ టెలిగ్రామ్ యాప్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. అప్పటికే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, విచాట్ అందుబాటులో ఉన్నాయి. ఫేమస్ కూడా అయ్యాయి. కానీ..వాటన్నింటికీ దీటుగా టెలిగ్రామ్‌ని పోటీలో నిలబెట్టాడు. వచ్చే ఏడాదికి 100 కోట్ల యూజర్స్‌ని సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకుంది టెలిగ్రామ్.
రష్యాలో పుట్టి పెరిగిన పావేల్ దురోవ్ 2014లో ఆ దేశం విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అప్పట్లో ఆయన VKontakte పేరిట ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని స్థాపించాడు. అయితే... ప్రభుత్వం అప్పట్లో ఈ యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రూప్‌లు కనిపించకూడదని ఆంక్షలు విధించింది. ఈ డిమాండ్‌లకు తలొగ్గలేక అక్కడి నుంచి వచ్చేశాడు పావేల్ దురోవ్. ఆ తరవాత రష్యాలో టెలిగ్రామ్ యాప్‌కీ చిక్కులు ఎదురయ్యాయి. సెక్యూరిటీ, ప్రైవసీ లేదన్న కారణంగా అక్కడ ఆందోళనలు జరిగాయి. అప్పటి నుంచే ఈ యాప్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఎన్‌క్రిప్షన్ కూడా సరిగ్గా లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. Forbes ప్రకారం పావేల్ దురోవ్ ఆస్తుల విలువ 15.5 బిలియన్ డాలర్లు. అయితే...కొన్నాళ్లుగా ఈ యాప్‌పై విపరీతమైన నిఘా పెరగడం వల్ల ఇబ్బందులు తప్పలేదు. పాపులారిటీతో పాటు అధికారుల నుంచి నిఘా పెరిగింది. డేటా బ్రీచ్ జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి.
డ్రగ్ ట్రాఫికింగ్ కూడా జరుగుతోందన్న ఆరోపణలతో ఒక్కసారిగా టెలిగ్రామ్ యాప్‌పై అనుమానాలు పెరిగిపోయాయి. Moscow Times వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ యాప్ ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్, పిల్లలపై అత్యాచారాలు, మనీ లాండరింగ్ లాంటి నేరాలు పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌లో టెలిగ్రామ్ యాప్‌కి చాలా పాపులారిటీ వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సమాచారమంతా ఇందులోనే ఎక్కువగా షేర్ అవుతోంది. అందుకే అక్కడి అధికారులు టెలిగ్రామ్‌ని వర్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ గా చెబుతున్నారు. చట్టానికి లోబడి ఈ యాప్ నడుచుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అందుకే అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టు సమాచారం. పైగా ఈ లోపాలపై ఎన్నోసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ వ్యవహారం అరెస్ట్ వరకూ వెళ్లింది. "నాకు ఎవరో ఆర్డర్ వేస్తే నచ్చదు. నాకు నచ్చినట్టు నేనుంటా" అని 2014లో ఓ సందర్భంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడు పావేల్ దురోవ్. అతని వైఖరి కూడా టెలిగ్రామ్ పతనానికి ఓ కారణంగా చెబుతున్నారు.
Also Read: Israel: మా జోలికొస్తే తాట తీస్తాం, ఎంతకైనా తెగిస్తాం - హెజ్బుల్లాకి నెతన్యాహు వార్నింగ్