Batool Begum : గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందిన, ప్రతిభ కనర్చిన ప్రతిభామూర్తులకు, సామాజిక సేవలకు కేంద్రం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. అనేక మంది ప్రముఖులు ఈ అవార్డులకు ఎంపిక కాగా ఈ సారి పుదుచ్చేరికి చెందిన డోలు వాయిద్యకారుడు, మహారాష్ట్రకు చెందిన అంధ హోమియో వైద్యుడు, నాగాలాండ్ కు చెందిన పండ్ల వ్యాపారి, బిహార్ కు చెందిన ఎంబ్రాయిడరీలో నిపుణురాలు నిర్మలాదేవీ, కర్ణాటకు చెందిన ప్రముఖ తోలు బొమ్మలాట కళాకారిణి భీమవ్వ డొల్లబల్లప్ప షిలేఖ్యతారా లాంటి వారు చాలా మందే ఉన్నారు. వీరితో పాటు రాజస్థాన్ కు చెందిన ప్రముఖ జానపద గాయకురాలు బతూల్ బేగంకు పద్మశ్రీ (Padma Shri award) వరించింది.
జైపూర్‌కు చెందిన భజన కళాకారిణి బతూల్ బేగం ప్యారిస్ టౌన్‌హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన ఏకైక రాజస్థాన్ మహిళా కళాకారిణిగా పేరొందారు. ఆమె ముస్లిం మతానికి చెందినప్పటికీ గణపతి, రామ భజనలు పాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. డోలు, డోలక్, తబలా వంటి వాయిద్యాలను వాయిస్తూ ప్రసిద్ధి చెందారు. 2022లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బతూల్ బేగంను 2021 నారీ శక్తి పురస్కారంతో సత్కరించారు. భారతీయ జానపద సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లి దానికి గుర్తింపు తెచ్చినందుకు ఈ అవార్డు ఆమెకు లభించింది.
బతూల్ బేగం గురించి..
బతూల్ బేగం జైపూర్ నివాసి. స్వస్థలం నాగౌర్ జిల్లా. ఆమ గత 8ఏళ్ల నుంచి భజనలు, పాటలు పాడుతోంది. మాండ్, భజన జానపద పాటలు పాడడం ఆమె ప్రత్యేకత. రాజస్థానీ జానపద సంగీతంలో ఎవరూ ఆమెను మించిన వారు ఎవరూ లేకపోవడం చెప్పుకోదగిన విషయం. బతూల్ బేగం కార్యక్రమాలు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుగుతాయి. ఆమె పెద్ద వేదికలపైనా ప్రదర్శనలిచ్చి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆమె డోల్, తబలా వంటి వాయిద్యాలనూ వాయిస్తారు. 2021లో నారీ శక్తి అవార్డును అందుకున్నారు. ఇప్పుడు 72ఏళ్ల వయసులో బతూల్ బేగం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
25 దేశాలను సందర్శించిన బతూల్
బేగం స్వదేశంలోనే కాకుండా రెండేళ్ల క్రితం నమస్తే ఫ్రాన్స్ అనే కార్యక్రమంలో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఎల్.కె. సుబ్రమణ్యం, గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్‌తో సహా అనేక మంది పెద్ద కళాకారులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. 'కేసరియ బలం ఆవో సా, పదారో మహారే దేశ్' పాట పాడి ప్రసిద్ధికెక్కారు. బతూల్ మొత్తం ప్రపంచంలోని 25 దేశాలను సందర్శించగా.. తాను 10వ తరగతి వరకు చదువుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు చిన్నప్పట్నుంచే పాటలన్నా, భజలనలన్నా చాలా ఇష్టమని, అదే తనను ఆ వైపుకు మళ్లేలా చేసిందన్నారు. గుడికి వెళ్లి భజనలు చేయడంపై తనను చాలా మంది ప్రశ్నించేవారని, కానీ తాను అవేం పట్టించుకోకుండా పాడుతూనే ఉండేదాన్నని చెప్పారు.
Also Read : Republic Day 2025: పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్