Bihar mobile based e voting: భారత్‌లో ఓటింగ్ ప్రక్రియను సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీహార్ లో సెల్ ఫోన్ ద్వారానే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్‌లో మున్సిప్ల ఉప ఎన్నికల కోసం వినూత్న ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఓటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటి నుండే ఓటు వేయడానికి ఈ ఓటింగ్ అనుమతిస్తుంది. ముఖ్యంగా ఓటింగ్ బూత్‌లకు చేరుకోలేని వారికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. ఈ విధానం బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SECBHR) ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. పట్నా, రోహ్‌తాస్, తూర్పు చంపారణ్ జిల్లాలలోని ఆరు నగరపాలక సంస్థల ఎన్నికలలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు.
మొబైల్ ద్వారా ఓటు ఎలా వేస్తారంటే ?
మొబైల్ ఆధారిత ఈ-వోటింగ్ ... ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ యాప్ లేదా బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఓటు వేయడానికి ఓటర్లను అనుమతించే డిజిటల్ ఓటింగ్ విధానం. ఈ విధానం వల్ల సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, వలస కార్మికులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు వంటి పోలింగ్ బూత్‌లకు చేరుకోలేని వారి కోసం రూపొందించారు. ఈ విధానం ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం , ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడం లక్ష్యంగా ఖరారు చేశారు.
ఈ-వోటింగ్ ఎలా పనిచేస్తుంది?
ఈ-వోటింగ్ ప్రక్రియ రెండు మొబైల్ యాప్‌ల ద్వారా నిర్వహిస్తారు.
1. e-Voting SECBHR : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా అభివృద్ధి చేసిన యాప్. 2. బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ యాప్ : బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేయించిన యాప్ రెండో ఆప్షన్. 1. ఓటర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో “e-Voting SECBHR” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.2. ఓటరు జాబితాలో నమోదైన ఫోన్ నంబర్‌తో యాప్‌ను లింక్ చేయాలి.3. ఓటింగ్ రోజున, ఓటరు యాప్ లేదా బీహార్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఓటు వేయవచ్చు.4. గుర్తింపు కోసం OTP , ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ-వోటింగ్ వ్యవస్థలో ఓటింగ్ ప్రక్రియ సమగ్రత , గోప్యతను కాపాడేందుకు సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా ఓట్లను ఎన్ క్రిప్ట్ చేస్తారు. అధికారిక లెక్కింపు సమయంలో మాత్రమే డీక్రిప్ట్ చేస్తారు. ఓటరు గుర్తింపును ధృవీకరించడానికి ఫేస్ రికగ్నేషన్, లైవ్ ఫేస్ స్కాన్‌లు ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్‌లలో ఉపయోగించే VVPAT (వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) లాంటి ఆడిట్ ట్రయిల్ ఉంటుంది. ఒకే మొబైల్ నంబర్‌తో గరిష్టంగా ఇద్దరు ఓటర్లు మాత్రమే లాగిన్ చేయవచ్చు. ప్రతి ఓటు ఓటరు IDతో ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా ఓటింగ్ బూత్‌లకు చేరుకోలేని వారి కోసం సిద్ధం చేశారు. సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, వలస కార్మికులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు ఈ అవకాశం కల్పిస్తారు. సుమారు 10,000 మంది ఓటర్లు ఈ-వోటింగ్ కోసం నమోదు చేసుకున్నారని బీహార్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ-వోటింగ్ విధానాన్ని యూరోపియన్ దేశమైన ఎస్టోనియా ఇప్పటికే విజయవంతంగా అమలు చేసింది. భారతదేశంలో ఈ విధానాన్ని మొదటిసారిగా బీహార్ ప్రవేశపెట్టడం కీలకమైన అడుగుగా బావిస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే ఇతర చోట్ల అమలు చేస్తారు.