Extra marital affairs In Warangal | హనుమకొండ: వివాహేతర సంబంధాలు ఇద్దరి జీవితాలను కాదు, కొన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలు సైతం తీస్తున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేయడంతో పాటు ప్రైవేట్ భాగాల్లో జీడిపోసి హింసించారు.
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో వివాహిత పై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహితను ఆమె బంధువులు చెట్టుకు కట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె వివస్త్రను చేసి దాడి చేశారు. అయినా శాంతించని మహిళ బంధువులు జననాంగాల్లో జీడిపోసి చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వివరాలు సేకరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతికి పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకొని, కొన్నిరోజుల కిందట ఆ మహిళతో కలిసి వెళ్లిపోయారు. తన భర్త వేరే మహిళతో వెళ్లిన విషయాన్ని స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి మహిళ తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆ మహిళ తల్లిదండ్రులు, బంధువుల చుట్టుపక్కల గాలించారు. పారిపోయిన ఇద్దరిని వెతికి ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి వారిపై దాడి చేశారు. ఇలాంటి పనులు చేస్తే మా పరువు ఏమవుతుందని, కూతురి జీవితం నాశనం అవుతుందంటూ ఇద్దరిని కొట్టారు. తన భర్తతో వివాహేతర సంబందం పెట్టుకున్న మహిళపై దాడి చేసి ఏం మందు పెట్టావు అంటూ వివస్త్రను చేశారు. అనంతరం ఇద్దరికి గుండు గీయించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వద్దని వేడుకుంటున్నా ఆమెను వివస్త్రను చేసి జననాంగాల్లో జీడి పోసి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత నుంచి దాడికి గురైన ఇద్దరు ఆచూకీ లేదని సమాచారం.