Bengal BJP: 'డిసెంబర్ తర్వాత దీదీ సర్కార్ ఉండదు- మా దగ్గర ప్లాన్ ఉంది'

ABP Desam   |  Murali Krishna   |  22 Nov 2022 05:03 PM (IST)

Bengal BJP: ఈ ఏడాది డిసెంబర్ తర్వాత బంగాల్‌లో దీదీ సర్కార్ ఉండదని ఓ భాజపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

(Image Source: PTI)

Bengal BJP: బంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌ త్వరలోనే కూలిపోతుందని భాజపా సంచలన వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్‌ తర్వాత దీదీ సర్కార్ ఉండదని భాజపా అసన్సోల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మంగళవారం అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టే పెద్ద ఎత్తుగడ తమ పార్టీ దగ్గర ఉందని ఆమె అన్నారు.

డిసెంబరులో ఇక్కడ 'ఖేలా' (ఆట) ఉంటుంది. 30 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు మా పార్టీతో కాంటాక్ట్‌లో ఉన్నారు. డిసెంబర్ తర్వాత తమ ప్రభుత్వం ఉండదని వారికి తెలుసు. మేము మా వ్యూహాన్ని ప్రకటించం. కానీ ఏదో ఒకటి జరుగుతుంది. డిసెంబర్‌లో పెద్ద ఖేలా ఉంటుందని మా నాయకత్వం పదేపదే చెబుతోంది. బంగాల్‌ ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు వెళ్తుంది. ఇది దివాలా తీసిన ప్రభుత్వం. వారి వద్ద డబ్బు లేదు. ఎలా ఉంటుంది? వారు పని చేస్తారా? రాష్ట్రాన్ని నడుపుతున్న వారిలో 50 శాతం మంది జైలులో ఉన్నారు, మిగిలిన వారు కూడా వెళ్తారు, అప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు?                         -       అగ్నిమిత్ర పాల్, భాజపా ఎమ్మెల్యే

కొత్తేం కాదు

బంగాల్ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా కొన్ని వారాల క్రితం ఇదే వాదన చేశారు. మమతా బెనర్జీని త్వరలో అరెస్టు చేస్తామని, 40 మందికి పైగా టీఎంసీ నేతలు తమ పార్టీని సంప్రదించారని చెప్పారు.

డిసెంబర్ నాటికి మమతా బెనర్జీని అరెస్టు చేయవచ్చు. 41 మంది టీఎంసీ ఎమ్మెల్యే పేర్లు అగ్రనాయకత్వం దగ్గర ఉన్నాయి. డిసెంబర్‌లో ప్రభుత్వం పడిపోతుంది.                                         -   సుకాంత మజుందార్, బంగాల్ భాజపా అధ్యక్షుడు 

మిథున్

యాక్టర్, భాజపా నేత మిథున్ చక్రవర్తి కూడా అంతకుముందు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్‌లో ఉన్నారన్నారు. అందులో 21 మంది అయితే నేరుగా భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

మీకు బ్రేకింగ్ న్యూస్ కావాలా? ఈ క్షణంలో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలకు మాతో (భాజపా) చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వీరిలో కూడా 21 మంది నేరుగా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇక మిగిలింది మీరే ఊహించుకోండి.                                       "

-   మిథున్ చక్రవర్తి, భాజపా నేత

Also Read: Viral News: మార్నింగ్ వాక్ కలిపింది ఇద్దరినీ- 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!

Published at: 22 Nov 2022 04:57 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.