Partha Chatterjee On SSC Scam:


నేనో బాధితుడినైపోయాను-పార్థ ఛటర్జీ


పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్ అయిన తరవాత మొదటిసారి స్పందించారు. "నాపై కుట్ర జరుగుతోంది. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఈ కుట్రలో నేనొక బాధితుడినయ్యాను" అని పార్థ ఛటర్జీ అన్నట్టు ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్‌ వెల్లడించింది. ఈ భారీ కుంభకోణంలో పార్థ ఛటర్జీ హస్తం ఉందని అంతా భావిస్తున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఇప్పటికే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. "అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్నే అనుసరిస్తాం. అనుకున్న గడువులోగా ఈడీ అధికారులు విచారణను పూర్తి చేయాలి" అని టీఎమ్‌సీ నేత అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. ఇక పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఎట్టకేలకు డబ్బు విషయమై మాట్లాడారు. తన ఇళ్లలో ఇప్పటి వరకూ దొరిగిన డబ్బంతా పార్థ ఛటర్జీదేనని వెల్లడించారు. ఆయన సన్నిహితులు కొందరు ఈ నగదుని తన ఇంటికి తీసుకొచ్చి పెట్టారని చెప్పారు. కొన్ని సార్లు స్వయంగా ఛటర్జీయే వచ్చి తన ఇంట్లో డబ్బు దాచారని స్పష్టం చేశారు. డబ్బు ఉన్న రూమ్‌లోకి ఎవరినీ వెళ్లనిచ్చే వారు కాదని, తనను కూడా అనుమంతించలేదని అన్నారు అర్పిత ముఖర్జీ. విచారణలో భాగంగా ఆమె చెప్పిన సమాధానాలను ఈడీ అధికారులు తెలిపారు. 


ఆ కార్లు ఏమైపోయాయో..? 


అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు విలాసవంతమైన కార్లు కనిపించకుండా పోవటంపైనా ఈడీ అధికారులు దృష్టి సారించారు. కలకత్తాలోని టోలిగుంజేలో తొలిసారి ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీ ఇంటిని సోదా చేశారు. ఆ సమయంలోనే ఆమెకు నాలుగు లగ్జరీ కార్లున్నాయని ఈడీకి తెలిసింది. ఆడీ A4,హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మెర్సిడెస్‌ బెంజ్ కార్లున్నాయని తేలింది. అయితే ఆమెను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆ కార్లు కనిపించకుండా పోయాయి. ఈడీ అధికారులు ఆమె ఇల్లు ఉన్న ప్రాంతంలోని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. అవి ఏమైపోయాయని ఆరా తీస్తున్నారు. అర్పిత ముఖర్జీ ఫ్లాట్‌లోని సీసీటీవి విజువల్స్‌ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ నాలుగు కార్లలో, రెండు కార్లు అర్పిత పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా, రెండు రియల్ ఎస్టేట్‌ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు రూ.28 కోట్ల నగదునీ స్వాధీనం చేసుకున్నారు.


ఆమె ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను ఈడీ ఇన్వెస్టిగేటర్లు పరిశీలిస్తున్నారు. ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల అడ్రెస్‌, అర్పిత ముఖర్జీ ఇంటి అడ్రెస్‌ మ్యాచ్ అవుతున్నాయని వెల్లడించారు. 2017లో రూ.లక్ష పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రారంభించినట్టు నిర్ధరించారు. చినార్ పార్క్‌ ఏరియాలో ఉన్న మరో ఇంట్లోనూ ఈడీ సోదాలు కొనసాగించింది. ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో నగదు దొరికే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న వారిని కూడా విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 


Also Read: Ramarao On Duty Review - రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?


Also Read: Liger Song: ‘వాట్ లగా’ అంటూ వచ్చేసిన విజయ్, మాస్ డైలాగ్స్‌తో మామూలుగా లేదుగా!