బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం " పెగాసస్ " నిఘా వ్యవహారంపై విచారణ జరిపించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన మమతా బెనర్జీ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. పెగాసస్‌పై విచారణకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తులు ఉంటారు. పెగాసస్ వ్యవహారాన్ని  దర్యాప్తు చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అక్కర్లేదని... బెంగాల్‌కు చెందిన వ్యక్తులపైనా నిఘా పెట్టినట్లుగా తేలింది కాబట్టి... తమ పరిధిలో తము దర్యాప్తు చేస్తామని బెంగాల్ సర్కార్ చెబుతోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సహా పీకే మరికొంతమంది బెంగాలీ నేతలపై కూడా...పెగాసస్ నిఘా పెట్టారని..  మీడియాలో ఆరోపణలు వచ్చాయి. వీటిపైన విచారణ జరపనున్నారు.
 
దేశంలో ప్రస్తుతం పెగాసస్ నిఘా వ్యవహారంపై రేగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. అయితే కేంద్రం మాత్రం విచారణకు ఆదేశించే ఉద్దేశంలో లేదు. ఈ విషయం చాలా సూటిగానే చెబుతోంది. ప్రధానంగా కేంద్రంపైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న  సమయంలో కేంద్రం విచారణకు ఆదేశిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. దీంతో కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా పెగాసస్‌ను ప్రయోగించారన్న చర్చ జరుగుతోంది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. అయితే.. పిటిషన్లు ఇంకా విచారణకు రాలేదు. విచారణ జరిగి.. నిర్ణయం వచ్చే సరికి బాగా సమయం పట్టే అవకాశం ఉంది. 


ప్రభుత్వాలకు మాత్రమే పెగాసస్ సాఫ్ట్ వేర్ అమ్ముతామని.. అమ్మామని.. ఇందులో మరో మాట లేదని ఈ సాఫ్ట్ వేర్ సృష్టికర్త అయిన ఇజ్రాయెల్ సంస్థ చెబుతోంది. దీంతో ఇండియాలో ఎవరిపైనైనా పెగాసస్‌ను ప్రయోగించి ఉంటే.. ఖచ్చితంగా అది ప్రభుత్వమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులు.. అత్యంత ముఖ్యులైన వీఐపీలపై ఇలానిఘా పెట్టి ఉంటే దేశభద్రత ప్రమాదంలో పడినట్లవుతుంది. దీంతో బెంగాల్ ప్రభుత్వం చేయించబోతున్న దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయన్నది ఆసక్తికరంంగా మారింది. 


అయితే ఈ  స్పై సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించి.. ఎవరు తీసుకొచ్చారు.. ఎవరు ప్రయోగించారు.. అన్ని తెలుసుకోవడం అంత తేలికగా అయ్యే పని కాదు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం.. అంతకు మించి అన్నీ పరిశీలించగలిగే అధికారం కావాలి. చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. బెంగాల్ దర్యాప్తు బృందానికి కేంద్రం సహకరిస్తుందా అన్నది సందేహమే. అయితే ఈ విషయంలో ... నిజాలు బయటకు రావాలని దేశంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్చను ఎవరు హరించినా ప్రజలు అంగీకరించే అవకాశం ఉండదు. అందుకే బెంగాల్ సర్కార్ నిర్ణయానికి ఎక్కువ మంది మద్దతు లభిస్తోంది.