CM Mamata Banerjee on CAA:
మత ఘర్షణలు జరుగుతాయ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీనియర్ అధికారులందరినీ అలర్ట్ చేశారు. కొందరు కావాలనే రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించే అవకాశముందని వాటిపై ఓ నిఘా ఉంచాలని ఆదేశించారు. డిసెంబర్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగే ప్రమాదముందని అంచనా వేశారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి భారీగా తుపాకులు స్మగ్లింగ్ అవుతున్నాయని వాటిపైనా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో బీజేపీపైనా విమర్శలు చేశారు దీదీ. ఎలక్టోరల్ బాండ్‌ల పేరిట గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ద్వారా బీజేపీ కోట్ల రూపాయలు దండుకుంటోందని మండి పడ్డారు. 2019 తరవాత దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, ఈ సారి ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ Citizenship Amendment Act (CAA),National Register of Citizens (NRC) అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని మమతా బెనర్జీ మండి పడ్డారు. "మాది మానవత్వంతో వ్యవహరించే
ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వంతో మనం పోరాటం చేయాలి" అని వెల్లడించారు. "నేను బతికున్నంత వరకూ రాష్ట్రంలో CAA అమలుని అంగీకరించను. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పౌరులు బెంగాల్ పౌరుల కన్నా తక్కువేమీ కాదు. మీ మద్దతు లేకుండా మోదీ ప్రధాని అయ్యేవారా..? అంతెందుకు నేనైనా సీఎంని అయ్యుండాదాన్నా" అని అన్నారు.
మోర్బీ ఘటనపై స్పందన..
గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిపోయిన ఘటనపైనా మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 140 మందికిపైగా మృతి చెందారని, ఇందుకు బాధ్యులైన వారిపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దీదీ ప్రశ్నించారు.
" మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనకు కారకులపై ఈడీ, సీబీఐ చర్యలు ఎందుకు చేపట్టలేదు.వాళ్లు కేవలం సామాన్యులపైనే తమ ప్రతాపం చూపిస్తారు. ప్రమాదం జరిగింది ప్రధాని సొంత రాష్ట్రంలో కనుకే నేను ఆయనను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నేను రాజీకీయాల గురించి ఏదీ మాట్లాడబోను. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ ఘటనపై నేను కామెంట్ చేయను. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పరిధిలో జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ జరిపించాలి. "
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
Also Read: Maharashtra Politics: ప్రధాని మోడీని తప్పకుండా కలుస్తాను, చాలా విషయాలు చెప్పాలి - సంజయ్ రౌత్