Man Climbs Mobile Tower for Girlfriend UP:  ప్రేమకు కళ్లు లేవు.. వయసుతో అస్సలు పనేలేదు అనే పాత సామెతను ఈ కాలపు ప్రేమికులు అక్షరాలా నిరూపిస్తున్నారు. తనకంటే ఏకంగా 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లి అయిన 50 ఏళ్ల ప్రియురాలి కోసం ఓ 30 ఏళ్ల యువకుడు ఏకంగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవరెక్కి నానా హంగామా చేశాడు. ప్రియురాలిపై అలిగి, ఆమెను చూడాలంటూ సినిమా ఫక్కీలో ఒక రాత్రి అంతా టవర్‌పైనే గడిపిన ఈ వింత ప్రేమికుడి కథ ఉత్తరప్రదేశ్   సరిహద్దుల్లో జరిగింది. 

Continues below advertisement

ఆమె ఫోన్ ఎత్తలేదని.. ముంబై నుండి యూపీకి పరుగు! 

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన చందన్  అనే యువకుడు ముంబైలో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి నలుగురు పిల్లల తల్లి, యాభై ఏళ్ల వయసున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడి, అది కాస్తా కాస్త ముదిరి  గాఢమైన ప్రేమ గా మారింది. అయితే, గత కొన్ని రోజులుగా సదరు ప్రియురాలు చందన్ ఫోన్ ఎత్తడం మానేసింది. దీంతో తట్టుకోలేకపోయిన మన రోమియో.. ముంబై నుండి నేరుగా ప్రియురాలి స్వగ్రామానికి పరుగున వచ్చాడు. అక్కడ కూడా ఆమె ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.   పోలీసులకు తానే ఫోన్ చేసి.. టవర్ ఎక్కేసాడు! 

Continues below advertisement

ప్రియురాలిని లొంగతీసుకోవడానికి చందన్ ఒక ఊహించని స్కెచ్ వేశాడు. గ్రామంలో ఉన్న 200 అడుగుల మొబైల్ టవర్‌ను చకచకా ఎక్కేసాడు. అంతటితో ఆగకుండా, తానే స్వయంగా జేబులోంచి మొబైల్ తీసి పోలీసుల అత్యవసర నంబర్  112 కు డయల్ చేశాడు.  సార్.. నేను టవర్ చివర ఉన్నాను.. నా ప్రియురాలిని ఇక్కడికి పిలిపించకపోతే దూకేస్తా  అంటూ పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ ఫోన్ రావడంతో కంగారుపడిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను పిలిపిస్తాం అని నచ్చజెప్పిన ఖాకీలు! 

చందన్ టవర్‌పై ఉండటం చూసి గ్రామస్థులంతా నిద్రలేచి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు మెగాఫోన్ల ద్వారా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కిందకు దిగాలని ఎంత బ్రతిమాలినా వినని చందన్..  ఆమె రావాల్సిందే  అంటూ మొండికేసాడు. చివరకు పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. నువ్వు కిందకు దిగు.. నీ ప్రియురాలిని పిలిపించి మీ ఇద్దరికీ మాట్లాడిస్తాం  అంటూ గట్టిగా హామీ ఇచ్చారు. పోలీసుల మాటలు నమ్మిన మన ప్రేమికుడు మెల్లగా టవర్ దిగి కిందకు వచ్చాడు.   ప్రేమ మైకంలో ఉన్నోడికి.. లాకప్ ట్రీట్‌మెంట్!   

చందన్ కిందకు అడుగు పెట్టగానే పోలీసులు అతనికి  గౌరవ వందనం చేసి అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఆత్మహత్యాయత్నం నెపంతో కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.  ప్రేమించడం తప్పు కాదు బాబు.. కానీ ఇలా అర్ధరాత్రి టవర్లు ఎక్కి ఊరి జనాన్ని, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించడం ఏంటయ్యా  అంటూ లాకప్‌లో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రేమ మైకంలో టవరెక్కిన చందన్.. ఇప్పుడు లాకప్ ఊచలు లెక్కబెడుతుండటం చూసి గ్రామస్థులు సెటైర్లు వేసుకుంటున్నారు.