తూర్పు, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరం వద్దకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా తెలంగాణలో శనివారం (నేడు) పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం  తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణకు పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు చెప్పింది.

  


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో పశ్చిమ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక రాయలసీయలో కూడా మరో మూడు రోజులపాటు ఒకటి రెండు ప్రదేశాల్లో మోస్తరు లేదా తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో ఇవాళ, రేపు (ఆదివారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 


ఏపీలో ఎండలు మండుతున్నాయి..
ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు చుక్కలు చూపెడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. నిన్న (సెప్టెంబర్ 17) ఏపీలో అత్యధికంగా కావలిలో 38.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరులో 36.5 డిగ్రీల సెల్సియస్, బాపట్లలో 36.4 డిగ్రీలు, జంగమేశ్వరంలో 36.2 డిగ్రీలు, తునిలో 36.1 డిగ్రీలు, తిరుపతిలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. 


Also Read: Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే... మీ ప్రాణాలు డేంజర్లో ఉన్నట్లే... మరి, మంచి నీళ్లు ఎలా తాగాలి?


Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఎపిసోడ్ 13: ఇంతులతో శ్రీరామ్.. బంతులతో బిగ్ బాస్.. హమీదాకు అంతా ఫిదా!