బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర కోస్తా, ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనంగా మారి వాయుగుండంగా మారవచ్చని తెలిపింది. తీవ్ర వాయుగండం, వాయుగండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


ఏపీలో మూడు రోజుల వరకు.. 
ఏపీలో ఇవాళ (సెప్టెంబర్ 14) ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 


తెలంగాణలో ఇలా.. 
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఇవాళ (సెప్టెంబర్ 14), రేపు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న వెల్లడించారు. కాగా, సోమవారం నాడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిన్న అత్యధికంగా కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


రేపు (సెప్టెంబర్ 15న) పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అదికారులను ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో వైరల్ జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల తాకిడి అధికమైంది. 


Also Read: Horoscope Today : ఈ రాశుల వారు అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి... ఆ రాశుల ఉద్యోగులు శుభవార్తలు వింటారు


Also Read: Space-X Inspiration 4 Launch: సరికొత్త చరిత్ర.. కేవలం పౌరులతో అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న తొలి రాకెట్ ప్రయోగం..