Weather Latest Update: తెలంగాణలో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం  పడుతుందని చెప్పింది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు  వాతావరణ కేంద్రం అధికారులు. ఉరుము, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. 


ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురిసింది. నిన్న (ఆదివారం) వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్, నల్గొండ,  సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత15.5  డిగ్రీలు, హైదరాబాద్‌లో 22.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం పాటు... తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 21 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల  మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో... చలి తీవ్రత పెరుగుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (ఆదివారం) పలు జిల్లాల్లో వర్షం కురిసింది. తిరుమల, తిరుపతిలో వర్షం దంచికొట్టింది. నిన్న (ఆదివారం) సాయంత్రం నుంచి  రాత్రి వరకు వర్షం కురిసింది. ఈదురు గాలులు కూడా వీస్తుండడంతో.. శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. రోడ్లపై వర్షపు నీరు  కూడా చేరింది. ఇక శ్రీసత్యసాయి, బాపట్ల, కృష్ణా, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లోనూ వర్షాల పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందన్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.  ఇక... కోనసీమ, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, గోదావరి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఈఏడాది వర్షాలు తక్కువే. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడితే.. దక్షిణాదిలో మాత్రం అంతంతమాత్రమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సరిపడా వర్షాలు పడలేదు.  దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలలో వాన చుక్క పడలేదు. సరైన వర్షాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇప్పుడు... వర్షాలు  కురుస్తాయన్న వార్త.. ఊరట కలిగిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు... ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. మరోవైపు  రాష్ట్రంలోకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. అందుకే కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న చిత్తూరులో 5.5, యలమంచిలిలో  5.2, సత్తెనపల్లిలో 5.1, పెందుర్తిలో 3.2, తిరుపతిలో 3.4, ఎన్టీఆర్ జిల్లాలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీ, తెలంగాణలో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం అధికారులు చెప్పిన వార్తతో... రైతుల ముఖాల్లో కాస్త సంతోషం తెచ్చింది.