Weather Latest News: నిన్నటి దక్షిణ అంతర్గత కర్నాటక నుండి ఉత్తర అంతర్గత కర్నాటక, మరఠ్వాడా మీదుగా తూర్పు విధర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న తూర్పు గాలులలోని ద్రోణి ఈరోజు అదే ప్రాంతంలో  కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయం, దక్షిణ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉండనుంది. తెలంగాణలోని ఏ జిల్లాల్లోనూ నేడు ఎల్లో అలర్ట్ జారీ చేయలేదు.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది. 72 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


Andhra Pradesh Weather: ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు. కానీ, పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


‘‘ఆంధ్ర​, తెలంగాణ రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతోంది, కానీ గత మూడు సంవత్సరాలతో పాలిస్తే చలి తీవ్రత తక్కువగానే ఉంది. విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలను తాకింది. కానీ రాత్రికి 21.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతోంది. ఇది ఈ సమయంలో చాలా అత్యధికం. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలో మాత్రం చలి తీవ్రత కొనసాగుతున్నా, గత ఏడాది లాగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈసారి లేదు. కోస్తాంధ్ర ప్రాంతంలో చలి తక్కువగా ఉంది. విజయవాడ​, గుంటూరు నగరాల్లో మధ్యాహ్నం వేడిగా, అర్ధరాతి చల్లటి వాతావరణం ఉందే కానీ తీవ్రమైన చలి లేదు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా చలి తీవ్రత అంతగా లేదు. తిరుపతి, నెల్లూరు నగరాల్లో చలి సాథారణం కంటే తక్కువగా ఉంది. తిరుపతిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా నమోదయ్యింది. రాయలసీమ జిల్లాల్లో సాథారణంగా 10 డిగ్రీలకు కింద ఉష్ణోగ్రతలు పడిపోవాలి. కానీ ప్రస్తుతం మాత్రం వెచ్చగా ఉంది. కర్నూలులో 20.2 డిగ్రీలు ఉండటం అసలు చలి ఉందా లేదా, ఇది చలి కాలమేనా అని ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.