Weather Latest News: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వారు అంచనా వేశారు.


ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.3 డిగ్రీలుగా నమోదైంది. 74 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, వాయువ్య దిశల్లో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని చెప్పారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో ఈ రోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.


Delhi Weather News: ఢిల్లీలో
గత కొన్ని రోజులుగా, దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌తో సహా అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం.. పర్వతాలలో విపరీతమైన మంచు కారణంగా చలి పెరుగుతుంది. హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పొరుగు దేశాలు నేపాల్, భూటాన్, ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ శిఖరాలపై మంచు కురుస్తోంది.


హిమపాతం కారణంగా మైదాన ప్రాంతాల్లో చలి పెరిగింది. పంజాబ్‌లో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న చలి కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వాతావరణ శాఖ ప్రకారం, పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 17 మధ్య నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ నుంచి ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.


Punjab Weather: పంజాబ్‌లో దట్టమైన పొగమంచు
పంజాబ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చలి కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోయింది. పెరుగుతున్న చలి కారణంగా, ప్రజలు వెచ్చని బట్టలు ధరించి, మంటల దగ్గర కూర్చోవాలని సూచించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. అదేవిధంగా బిహార్, నేపాల్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.