Weather Latest Update: తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. ఇది అల్పపీడనంగా మారుబోతోంది. ఏడు తేది నాటికి మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. 8వ తేదీకి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖాధికారులు. ఫలితంగా మోచా తుపాను ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. 


మోచా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టబోతన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు చూస్తున్నారు. ప్రస్తుతానికి ద్రోణి ప్రభావం విశాఖపట్నంతోపాటు పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉండనుంది. ఎం.జే.వో. ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతోంది. అది మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో భారీ వర్షాలను, పిడుగులకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. 


శనివారం నుంచి సోమవారం వరకు అలర్ట్..


ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ కావాలని సూచిస్తోంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుత సమాచారం మేరకు ఈ తుఫాన్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండి సమాచారం మేరకు ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు. అల్పపీడనం ఏర్పడనున్న కారణంగా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఈ సాయంత్రానికి తిరిగి రావాలని  కోరారు.


కంట్రోల్ రూం నెంబర్లు ఇవే...
అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.


కర్ణాటక; తమిళనాడు మీదుగా ద్రోణి...
దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.ఈ మేరకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు.


రానున్న మూడు రోజుల వాతావరణ వివరాలు:


శనివారం:- 
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.


ఆదివారం:- 


కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 
అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.


సోమవారం :- 
చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.  విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.. 


తెలంగాణలో పరిస్థితి చూస్తే...
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏడో తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రస్తుతానికి ఓ ప్రకటన రిలీజ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. 8వ తేదీ కూడా వర్షాలు పడతాయి. 9వ తేదీ మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వెదర్‌ డిపార్ట్‌మెంట్‌ అంచనా వేస్తోంది. 7 జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 


శుక్రవారం తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది. 35.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయింది. అత్యల్పం హైదరాబాద్‌కు సమీపంలోని హయత్‌నగర్‌లో 19 డిగ్రీలుగా నమోదు అయింది. ఇవాళ ఉష్ణోగ్రతలు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా. అత్యల్ప ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు రిజిస్టర్ కావచ్చని చెబుతోంది.