శ్రీలంకకు ఆనుకొని ఏర్పడిన వాయుగుండం బలపడింది. ప్రస్తుతానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గర కేంద్రీకృతమైంది ఉంది. దీని వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రాలు మాత్రం కాస్త బలమైన అలలతో ప్రమాదకరంగా ఉంటాయని తెలిపింది. శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ(బుధవారం, ఫిబ్రవరి 1) శ్రీలంకలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం శ్రీలంకను తాకి హిందూ మహాసముద్రం వైపు వెళ్లనుంది.  దీని ప్రభావంతో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం తదితర ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగరవేశారు. 


తెలంగాణ వాతావరణం


తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు వాటితో పాటు మధ్య తెలంగాణ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల పొగమంచు అధికంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






తెలంగాణలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 33 డిగ్రీలు, 16.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాయువ్య భారతంలో రానున్న 5 రోజుల పాటు చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 2 వరకు వాయవ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు ఉంటుందని అంచనా. వచ్చే 3 రోజుల్లో ఇది 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది.






ఫిబ్రవరి 1 వరకు మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు లేదు. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ మార్పు ఉండదు. తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో 4 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెల్సియస్ పడిపోతుంది.


మంగళవారం విడుదల చేసిన వాతావరణ అప్డేట్ ప్రకారం, రెండు రోజుల క్రితం వాతావరణ మార్పులు కారణంగా హిమాలయ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షం, హిమపాతం సంభవించింది. గత కొన్ని రోజులుగా రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. అయితే జనవరి 31న (మంగళవారం) తేలికపాటి ఎండలు కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం కూడా ఢిల్లీలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది.