Bharat Nyaya Yatra: లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీని అరెస్టు చేస్తామని, అసోంలో హింసను ప్రేరేపించినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం (జనవరి 24) అన్నారు. కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో హింసను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలపై అసోం పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. హిమంత బిశ్వ శర్మ సిబ్సాగర్ జిల్లాలోని నజీరాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుందని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ను అరెస్టు చేస్తారని చెప్పారు.


మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈలోపు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) ఏర్పాటు చేసిన సిట్ ద్వారా సమగ్ర దర్యాప్తు కోసం కేసును అస్సాం సీఐడీకి బదిలీ చేసినట్లు అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ తెలిపారు. అంతకుముందు, బారికేడ్‌ను బద్దలు కొట్టడానికి ప్రజలను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.


బారికేడ్లను తొలగించిన కాంగ్రెస్ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ బోరా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా గాయపడ్డారు.


అసోం సీఎంపై రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యలు
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రిమోట్‌ ద్వారా నియంత్రిస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ఇక్కడ 'భారత్‌ జోడో న్యాయ యాత్ర'లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఇతర నేతలు కూడా తీవ్రంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు అసో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐయూడీఎఫ్‌లను కాంగ్రెస్ ఓడిస్తుందని గాంధీ అన్నారు.


ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న (మరణానంతరం)తో సత్కరించే నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్.. బుధవారం కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించడం కర్పూరీ ఠాకూర్‌కు నిజమైన నివాళి అని పేర్కొంది. దేశానికి ఇప్పుడు కావాల్సింది ‘నిజమైన న్యాయం’ తప్ప ‘ప్రతీకార రాజకీయాలు’ కాదని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన జయంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఈ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.