Pawan Kalyan: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటుడు పృథ్వీరాజ్ జనసేన గూటికి చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన (Jani Master joined Janasena)లో చేరారు. పవన్ పార్టీ కండువా కప్పి వారిద్దరిని సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా  జానీ మాస్టర్ పనిచేశారు. ఈ మూడు సినిమా ఇండస్ట్రీల్లోనూ మంచి కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు అందరి స్టార్ హీరోలతో ఆయన పనిచేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే తెలుగు బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా జానీ మాస్టర్ పనిచేశారు. దీని ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గరయ్యారు. సినీ, బుల్లితెర ప్రేక్షకుల్లో జానీ మాస్టర్ అంటే తెలియనివారు ఎవరూ లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 


జానీ మాస్టర్ గత కొంతకాలంగా జనసేనకు మద్దతుగా ఉన్నారు. వివిధ రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. పవన్‌ను విమర్శించేవారికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు.  ఇటీవల నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తల నిరసనల్లో జానీ మాస్టర్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీల దీక్షా శిబిరంలో బైఠాయించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడీలకు జగన్ సర్కార్ ఇచ్చిన హామీపై ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల జీతాలు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు దాని గురించే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా  జానీ మాస్టర్‌తో కలిసి జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గనుకుల కిషోర్ కూడా నిరసనల్లో పాల్గొన్నారు.


ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేతలతో కలిసి మాజీ మంత్రి హరి రామ జోగయ్యను కూడా జానీ మాస్టర్ కలిశారు. అలాగే జనసేనకు చెందిన ముఖ్యనేతలందరినీ కలుస్తూ వస్తున్నారు. దీంతో జానీ మాస్టర్ జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అతనిది నెల్లూరు జిల్లా కావడంతో అక్కడ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.  ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనలో జానీ మాస్టర్ చేరడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా జనసేన అభ్యర్థుల తరపున పోటీ చేస్తారా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.


నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక సీటైనా కేటాయించే అవకాశముంది. అదే జరిగితే జానీ మాస్టర్‌ను పవన్ బరిలోకి దింపవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జానీ మాస్టర్‌ను పోటీ చేయించడం వల్ల సినీ గ్లామర్ కలిసొస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి పవన్ కళ్యాణ్‌కు జానీ మాస్టర్ వీరాభిమాని.  పలు ఇంటర్వ్యూలు, షోలలో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. పవన్‌ ఎప్పటికైనా ఖచ్చితంగా సీఎం అవుతాడని చెబుతూ ఉంటారు. పవన్‌పై ఉన్న అభిమానంతోనే గత కొంతకాలంగా జనసేనకు మద్దతిస్తూ వస్తున్నారు. చివరికి పార్టీలో చేరి జనసేనకు తన సేవలు అందించాలని జానీ మాస్టర్ నిర్ణయించుకున్నారు.