Balineni Srinivas Reddy Comments:బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు.  మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి అసమ్మతితో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రకాశం జిల్లాలో తనకు నచ్చిన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికే వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. కానీ, జగన్ మాత్రం మాగుంటకు ఈసారి టికెట్ లేదని గతంలోనే తేల్చేశారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జగన్ ను కలిసేందుకు తాడేపల్లికి సైతం వెళ్లారు. అక్కడ హోటల్ లో ఉండి కలిసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారు. చాలా కాలంగా ఒంగోలులో అడుగు పెట్టలేదు. ఇటీవల జగన్ నుంచి పిలుపు రావడంతో బాలినేని తాడేపల్లికి వెళ్లి సీఎంను కలిశారు.  


ఈ క్రమంలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాగుంట శ్రీనివాసులురెడ్డి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉన్నారన్నారని అన్నారు. తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలని అన్నారు. సంతనూతలపాడు, కొండెపిలో తాను చెప్పిన వారికి జగన్ టికెట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 


తాను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకుంటానని.. అయినా కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకోవడం కోసం రాజీనామా చేయడం ఎంత సేపు అంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా అన్నీ సామరస్యంగా జరుగుతాయని అన్నారు. ఎర్రగొండపాలెంలో అభ్యర్థికి మంత్రి సురేష్ మద్దతు ఇస్తారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అసహన వ్యాఖ్యలు వైసీపీలో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.


ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయకపోతే.. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే తనకు ఇబ్బంది అవుతుందని బాలినేని భావిస్తున్నారు. అందుకే ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్‌ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే తాడేపల్లి వర్గాలు ఖరారు చేసేసినా.. బాలినేని మాత్రం తనవంతు ప్రయత్నాలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలినేనికి సంబంధం లేకుండానే ప్రకాశం జిల్లాలో కొన్ని సీట్లకు ఇప్పటికే ఇంఛార్జిలను నియమించడం పట్ల కూడా బాలినేని కాస్త అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తనకు కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశం అయ్యాయి.