Water In Dark Blue Color: ఢిల్లీ ప్రజలు ఇంట్లో కుళాయి తిప్పాలంటేనే భయపడిపోతున్నారు. చిత్ర విచిత్రమైన రంగుల్లో నీళ్లు వస్తున్నాయి. కొందరి ఇళ్లలో స్కై బ్లూ కలర్‌లో, మరి కొందరి ఇళ్లలో ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి కుళ్లాయి నీళ్లు. వెస్ట్ ఢిల్లీలోని 50 ఇళ్లలో పరిస్థితి ఇదే. ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో అప్పుడప్పుడు నీళ్ల సరఫరాలో ఇబ్బందులు వచ్చేవని, కానీ ఈ సారి ఈ సమస్య వింతగా ఉందని చెబుతున్నారు. "బాత్‌రూమ్‌లో కుళాయి విప్పగానే నీలం రంగులో నీళ్లు వచ్చాయి. నాకేమీ అర్థం కాలేదు. కాసేపు వదిలేశాం. ఆ తరవాత కూడా అలాగే వచ్చాయి. ఈ నీళ్లతో చేతికున్న సబ్బు కూడా పోవడం లేదు" అని ఓ మహిళ వివరించింది. ఈ కారణంగానే చాలా మంది ట్యాంక్‌లోకి నీళ్లు ఎక్కించడం లేదు. ఫలితంగా నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజులుగా ఇదే రంగులో నీళ్లు వస్తున్నాయని ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోడం లేదని, అసలు ఈ రంగులో నీళ్లు ఎందుకు ఉంటున్నాయో ఎవరూ చెప్పడం లేదని మండి పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు కొందరు ఈ సమస్యని తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీ జల్‌ బోర్డ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. 






ప్రాథమికంగా అధికారులు కొన్ని విషయాలు వెల్లడించారు. స్థానికంగా డెనిమ్ జీన్స్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే నీళ్లు కలిసి ఉంటాయని అందుకే ఈ రంగులో వస్తున్నాయని చెప్పారు. "స్థానికంగా 8-10 కంపెనీలున్నాయి. ఇప్పటికే కంప్లెయింట్ ఇచ్చాం. ఫిర్యాదు చేసిన వెంటనే ఆ కంపెనీల్లో పని చేసే వాళ్లు ఉన్నపళంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని బీజేపీ నేతలు చెబుతున్నారు.  Delhi Pollution Control Committee ప్రకారం డెనిమ్ డైయింగ్‌ ఫ్యాక్టరీలకు మాత్రమే అనుమతి ఉంది.  కానీ కొంత మంది అక్రమంగా ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. వేరే చోట ఉద్యోగాలు దొరకక ఇక్కడ పని చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ ఫ్యాక్టరీలు మూసేస్తే అందులో పని చేసే వాళ్లు రోడ్డున పడతారని, ప్రత్యామ్నాయం చూపించాలని కొందరు సూచిస్తున్నారు. ఢిల్లీ జల్‌బోర్డ్ సూపర్‌వైజర్‌ దృష్టికి ఇప్పటికే ఈ సమస్యని తీసుకెళ్లారు స్థానికులు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే నీళ్లు, ఇంటింటికీ సరఫరా అయ్యే నీళ్లలో కలవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉంటుందని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 


మొన్నటి వరకూ ఢిల్లీలో తీవ్ర నీటి కొరత తలెత్తింది. ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోయారు. హరియాణా నుంచి రావాల్సిన నీటి వాటా రాలేదని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ విషయంలో కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. నీటి కొరత తీర్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. వర్షాలు కురిసి ఇప్పుడిప్పుడే కాస్త నీటి కొరత తీరుతోంది. 


Also Read: Nitish Kumar: నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ డుమ్మా, ప్రత్యేక హోదాపై అలిగారా?