Nitish Kumar Skips Niti Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సమావేశంపై పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రతిపక్షాలు పూర్తిగా బైకాట్‌ చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ప్రతిపక్షాల ప్రతినిధిగా హాజరయ్యారు. కానీ..ఆమె కూడా కాసేపటికే వాకౌట్ చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు. సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేశారు. అయితే...అన్నింటి కన్నా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే...NDA మిత్రపక్షమైన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయనకు బదులుగా ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదిరి, విజయ్ కుమార్ సిన్హా ఈ మీటింగ్‌కి వెళ్లారు. ఆయన ఎందుకు రాలేదన్న కారణమైతే పార్టీ ఏమీ వెల్లడించలేదు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పైగా బిహార్ ప్రత్యేక హోదాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిత్రపక్షమే అయినా బిహార్‌ని కేంద్రం పట్టించుకోలేదని కొందరు నేతలు తీవ్రంగా విమర్శించారు. కేవలం కొంత నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని బిహార్‌లోని ప్రతిపక్ష నేతలు మండి పడుతున్నారు. కానీ దీన్ని రాజకీయం చేయొద్దని జేడీయూ నేతలు తేల్చి చెబుతున్నారు. గతంలోనూ నితీశ్ కుమార్‌ నీతి ఆయోగ్ సమావేశాలకు రాలేదని గుర్తు చేశారు. 


"నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ రాకపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన హాజరు కాలేదు. అప్పటి ఉప ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వెళ్లారు. నీతి ఆయోగ్‌లో సభ్యులుగా ఉన్న నలుగురు కేంద్ర మంత్రులూ బిహార్‌కి చెందిన వాళ్లే. దీనిపై అనవసరపు వాదనలు చేయొద్దు"


- నీరజ్ కుమార్, జేడీయూ ప్రతినిధి


వికసిత్ భారత్ @ 2047 అజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఇంత కీలకమైన భేటీకి నితీశ్ వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేక హోదా విషయంలో ఆయన కాస్త అసహనంగా ఉన్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే..ఇటీవల ఆయనను మీడియా ఇదే అంశంపై ప్రశ్నించింది. "ప్రత్యేక హోదా సంగతేంటి" అని ప్రశ్నించగా అందుకు నితీశ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "మెల్లగా అన్నీ మీకే అర్థమవుతాయి" అని వెల్లడించారు. అంటే...బిహార్‌కి కేంద్రం ఇంకేదో చేయబోతోందన్న హింట్ ఇచ్చారు. అప్పటి నుంచి నితీశ్ మళ్లీ NDA నుంచి జంప్ అవుతారన్న వార్తలూ వస్తున్నాయి. ఓ కూటమి నుంచి మరో కూటమిలోకి జంప్ కావడం నితీశ్‌కి కొత్తేమీ కాదు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండీ అలియన్స్‌ని వీడి NDAలో చేరారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అందుకే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్‌ ఈ సారి కచ్చితంగా నెరవేరుతుందని అంతా భావించారు. కానీ కేంద్రం ఆ ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. అందుకు బదులుగా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. 


Also Read: Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?