Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఫుల్ జోష్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తయిన ఈ యాత్ర.. ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 17 రోజులు 500 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది.
అయితే ఈ సందర్భంగా రాజస్థాన్‌లో ఆసక్తికర పరిణామం జరిగింది. తమ వైరుధ్యాలను పక్కన పెట్టి రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), సచిన్ పైలట్ (Sachin Pilot).. కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు డ్యాన్స్ వేసి జోష్ నింపారు.
వైరల్
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఒకే వేదికపైకి వచ్చారు. అంతేకాదు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి కాలు కదిపారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని గిరిజన నృత్యం చేశారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) కూడా వేదికపైకి వచ్చి వీరితో చేయి కలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని కోట డివిజన్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. దీంతో కాంగ్రెస్ అధి నాయకత్వం, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగుతున్నారు.
మహిళా మార్చ్
2023లో రెండు నెలల పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో 'మహిళా మార్చ్' ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటించారు. 2023 జనవరి 26, నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాదయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Viral Video: బైక్‌పై కుక్కతో వరుడి గ్రాండ్ ఎంట్రీ- వీడియో అదిరిందిగా!